ప్రజాశక్తి-యంత్రాంగం రోహిణి కార్తె ప్రభావంతో తీవ్రమైన ఎండలు కాస్తున్నా ఆదివారం సాయంత్రం జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అకాశం మబ్బులు కమ్మి భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల దాటికి పలుచోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. సామర్లకోట రూరల్ సామర్లకోట పట్టణం, మండల పరిధిలో పలు చోట్ల రహదారులు భవనాలపై భారీ వృక్షాలు కూలిపడి ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వేట్లపాలెం కెనాల్ రోడ్డులో ఈదురు గాలుల దాటికి బారీ వృక్షం నేలకూలి రోడ్డుకు అడ్డుగా పడింది. ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం ఏర్పడంతో సిఐ కె.దుర్గాప్రసాద్, ఎస్‌ఐ గరగారావు సరిదిద్దారు. సామర్లకోట రైల్వే గేటు వద్ద విశాఖపట్నం వెళ్ళే రైల్వే విద్యుత్ లైన్లపై భారీ దూది వృక్షం కూలిపడింది. దీంతో రైల్వే లైన్ విద్యుత్ సరఫరా నిలుపుదలచేసి విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. వర్షం అనంతరం రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన చెట్టు కొమ్మలను తొలగించే ఏర్పాటు చేశారు. తదుపరి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా అప్పటివరకు విశాఖపట్నం వైపు వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ప్రత్యామ్నాయంగా రెండవ నెంబర్ లైన్ మీదగా అధికారులు విశాఖ వైపు రైళ్లను మళ్ళించారు. గాంధీ బొమ్మ సెంటర్ నూకాలమ్మ తల్లి గుడి ఎదురుగా రైల్వే క్వార్టర్స్ వద్ద పార్క్ చేసి ఉన్న కారుపై భారీ వృక్షం పడడంతో కారు ముందు భాగం ధ్వంసం అయ్యింది. స్ధానిక ఇండిస్టియల్ ఎస్టేట్‌లో విద్యుత్ ట్రాన్స్‌పార్మర్‌పై చెట్టు కూలడంతో అంతరాయం ఏర్పడింది. స్ధానిక మెహర్‌కాంప్లెక్స్ పోస్టాపీసు ఎదురుగా విద్యుత్ స్ధంభం విరిగి రోడ్డుకు అడ్డంగా పడింది. స్ధానిక స్టేట్ బ్యాంక్ ఎదురుగా పానీపూరీ బండిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. బ్రౌన్‌పేటసెంటర్ దుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ వృక్షం విరిగి పడింది. సామర్లకోట జయలక్ష్మీటాకీటసు సమీపంలో రేకుల షెడ్డుపై వృక్షం కూలిపడింది. స్ధానిక రైల్వే ఒవర్ బ్రిడ్జిపై భారీ హౌర్డింగ్ కూలిపోయింది.
భారీ ఈదురు గాలులతో కూడిన వర్షంతో సామర్లకోట మండల పరిధిలో 10కి పైగా విద్యుత్ స్తంభాలు గ్రామాల్లో కూలిపడ్డాయి. పట్టణ పరిధిలో విద్యుత్ స్తంభాలపై చెట్లు పడి కూలినట్లు టౌన్ ట్రాన్స్‌కో ఎఇ రమేష్ కుమార్, రూరల్ ఎఇ చెప్పారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని ఆదివారం అర్ధరాత్రి 1గంట దాటినా విద్యుత్ సరఫరా పునరుద్దరణకు చర్యలు చేపడతామని వారు వివరించారు.
పెద్దాపురంలో సాయంత్రం ఒకేసారి ఈదురు గాలులతో కూడిన వర్ష బీభత్సంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దర్గా సెంటర్ పరిసర ప్రాంతాలలో షాపుల రేకులు పైకి ఎగిరిపోయాయి. వడ్లమూరు రహదారిలో పెద్ద రావి చెట్టు దుర్గమ్మ గుడి, పాండురంగడు ఆలయాలపై కూలడంతో ఈ ఆలయాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరహాలయ్యపేట, నువ్వులగుంట వీధి ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. పెద్దాపురం మండల పరిధిలో ప్రత్తిపాడు రహదారిలో దివిలి, చంద్రమాంపల్లి, పులిమేరులో చెట్లు నేల కూలడంతో ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక తలుపులమ్మ కాలనీ సమీపంలో తాడిచెట్టు విరిగి హై టెన్షన్ వైర్లు పడటంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపోవటంతో హై టెన్షన్ వైర్లు నేలకూలాయి. పెదపూడి మండలంలో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షంతో పలు గ్రామాల్లో రోడ్డుకిరువైపులా చెట్లు నేలకొరిగాయి. ఎస్‌ఐ పి.వాసు, సిబ్బంది తొలగించారు. పెద్దాడ గ్రామం నుంచి పెదపూడి, దోమాడ, కరకుదురు గ్రామాల మధ్యల ఆరుచోట్ల రోడ్డుకు రెండు వైపుల ఉన్న చెట్లు నేలకొరిగాయి. దీంతో పైన కాకినాడ ఆర్‌అండ్ బి రోడ్డులో ప్రజల రాకపోలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్దాడ గండ్రేడు మధ్య రహదారిలో చెట్లు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి










