ఆకలి మరచిపోయిన
ఓ సైకత శిల్పి
ఊపిరిసలపనివ్వని వర్తమానానికెదురుగా
మోపు చేసిన ధైర్యాన్ని
వ్యక్తపరచే కళాఖండాన్ని
తీరం మీద పోగేసిన ఇసుక దిబ్బలాంటి దుఃఖంతో ప్రారంభించాడు
సృజన ఎలా మొదలైతేనేం
హరితపారావారాన్ని గుప్పిట బంధించే
దేశమంత అరచేతుల్ని ఛేదించే తెగువను కదూ
అతడు ప్రదర్శించాలనుకున్నది
అందుకే
అరకల్లాంటి మెరికల్లాంటి దేహాలను
ఒక్కొక్కటీ రూపుకడుతూ సమూహం చేశాడు
వాళ్ల మధ్యలోంచి
అనియంత్రిత హస్తనైపుణ్య
సారాంశ ఫలితమేమో
కర్రుకు ఎర్రరంగు పూసిన
నాగలి నిటారుగా లేచింది
గాలిలోకి లేచిన చేటల్లోంచి
రాలిపడ్డ చెమటచుక్కలు రాశిగా
పోగు పడాల్సిన చోట
నెత్తుటి మంటల్నీ
వాటినెత్తుకున్న నడకల్నీ
అసంకల్పితమేమీ కాదు
అంతా స్పష్టంగానే బొమ్మకట్టాడు
దేశం ముంగిట నిండు గాదెల్లాంటి గ్రామాలపై
బుసకొట్టే ఆరుతలల రాచనాగు రహదారికెదురునిల్చి
మట్టి ప్రాణాలను మట్టుబెట్టనీయమని
గొంతెత్తే పక్షుల చుట్టూ
మొలిచిన పంజరాలనూ
లొంగదీసుకునే దౌర్జన్యాన్నీ
విసిరే ఎంగిలి ఎక్స్‌గ్రేషియాని
స్ఫురింపజేసేందుకు చాలా సమయం తీసుకున్నాడు
అతడి ఆకలి మరింత మరపుకొచ్చింది
అమ్మకానికి అవయవాలంటూ ఓ పక్కన ప్రకటన లిఖించబడింది
అకస్మాత్తుగా మొదలైన వర్షం
జీవం ఉట్టిపడే శిల్పాన్నీ
శక్తిలేక ఒరిగిపోయిన దేహాన్నీ
నిస్తేజంగా మూతబడ్డ కళ్లనీ
చుట్టుముట్టిన ఊచల్లాంటి వర్షం
వర్షం..వర్షం...
రెప్పలమాటు కలల దరిదాపులకి పోలేని
వర్షం... వర్షం
పాయల మురళీకృష్ణ
83094 68318