Aug 12,2023 00:01

విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న మాధవపెద్ది సురేష్‌

ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గానగాంధర్వుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం స్కూల్‌ ఆఫ్‌ పెర్ఫామింగ్‌, ఫైన్‌ ఆర్ట్స్‌ను ప్రాంభించారు. ఈ సందర్భంగా వర్సిటీలోని బుద్ధిజం విభాగం వద్ద బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని సీనీ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్‌ శుక్రవారం ఆవిష్కరించి మాట్లాడారు. ఎస్‌పి బాలు నుండి నేటి విద్యార్థులు సంస్కారాన్ని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నడవడికను నేర్చుకోవాలని సూచించారు. చదువు సంస్కారాన్ని నేర్పుతుందని ఎలా జీవించాలో తెలియజేస్తుందని, అందరూ చక్కగా చదువుకోవాలని అన్నారు. చదువు కేవలం డబ్బు సంపాదనకే కాక ఇలాంటి సంగీత, సాహిత్య, అభిలాషలతో కూడిన చదువు మనసును నింపుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఐ-పిఆర్‌ కమిషనర్‌ విజరు కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి మనిషికి మానసిక సంతృప్తిని ఇచ్చేవి సంగీత, సాహిత్య, లలిత కళలని అన్నారు. వాటిని నేర్చుకునేలా వర్సిటీలో విభాగాన్ని ఏర్పాటు చేయడం హర్షణీయమని అభినందించారు. అనంతరం నూతన విభాగం ఆవసరంపై వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ మాట్లాడారు. కార్యక్రమానికి స్కూల్‌ సంచాలకులు, జర్నలిజం విభాగాధిపతి జి.అనిత అధ్యక్షత వహించగా రెక్టార్‌ పి.వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ బి.కరుణ, అధ్యాపకులు పాల్గొన్నారు.