ప్రజాశక్తి - ఎఎన్‌యు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ, అధికార భాషా సంఘం అధ్యక్షులు పి.విజయబాబు, వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ సోమవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభకు ప్రొఫెసర్ ఇ.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించగా విజయబాబు మాట్లాడుతూ యువతరానికి స్ఫూర్తి ప్రదాత అల్లూరి సీతారామరాజు అని, వర్తమాన కాలంలో విద్యార్థినీ విద్యార్థులు అల్లూరి సీతారామరాజు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో అగ్నికణం అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. వీసీ మాట్లాడుతూ తెలుగువారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన విప్లవ జ్యోతి, గొప్ప దేశ భక్తుడు అల్లూరి సీతారామరాజు అని అన్నారు. ఈ సందర్భంగా ఆల్లూరి సీతారామరాజుపై కళా రూపాలను ప్రదర్శించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు వారసులు అల్లూరి శ్రీరామరాజును సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ క్షత్రియ సేవా సమితి సెక్రటరీ నడింపల్లి నానిరాజు, వర్సిటీ రెక్టార్ పి.వరప్రసాద మూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విగ్రహం వద్ద విజయబాబు, వీసీ రాజశేఖర్ తదితరులు










