వర్సిటీలలో విభాగాల విలీన ప్రక్రియ వెంటనే ఆపండి
క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విభాగాల విలీన ప్రక్రియలో భాగంగా వివిధ విభాగాలను అడ్డదిడ్డంగా పోస్టుల సంఖ్యను కుదించడం పట్ల అకడమిక్ కన్సల్టెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం వర్సిటీ ఉపకులపతి ఆచార్య కె.రాజారెడ్డికి, రిజిస్ట్రార్ ఆచార్య ఓఎండి హుస్సేన్ లకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సంఘం నేతలు కల్లూరు కిషోర్ కుమార్ రెడ్డి, ఐఎస్ కిషోర్ లు మాట్లాడుతూ విభాగాల విలీన ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 16 విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యా వ్యవస్థకు గొడ్డలి పెట్టి లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏపీ పీజీ సెట్ రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తూ ఎంతో మంది రాయలసీమలో ఉన్నటువంటి బడుగు, బలహీన వర్గాల, నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. బడ్జెట్ పోస్టులకు ఇప్పటివరకు పూర్తి చేయకుండా, దాదాపుగా 2007లో భర్తీ చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రక్రియ ఈరోజు వరకు కూడా భర్తీ చేయకపోవడం బాధాకరమన్నారు. అప్పుడు జాయిన్ అయిన ఆచార్యులు ఎంతోమంది పదవి విరమణ పొందారని తెలిపారు. వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఎటువంటి క్వాలిఫై పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూలు నిర్వహించి అపార్ట్మెంట్లు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జగదీశ్వరి, సునీత, దాము యాదవ్, శివశంకర్ రాయల్, బాలు, సుధేష్ణ, వీరారెడ్డి, హరి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










