
ప్రజాశక్తి-మధురవాడ : విద్యార్థులు, యువ పరిశోధకులు చంద్రయాన్ వంటి అంతరిక్ష ప్రయోగాల విజయాల నుంచి స్ఫూర్తి పొందుతున్నారని, వారిని ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలలో అంతరిక్ష శాస్త్ర పరిశోధనలకు ఇస్రో సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని ఇస్రో అట్మాస్ఫియరిక్ అండ్ స్పేస్ సైన్స్ ఏవియానిక్స్ చెక్ అవుట్ డివిజన్ డిప్యూటీ డైరక్టర్ ప్రదీప్‌కుమార్ పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కెరీర్ గైడెన్స్ సెంటర్, ఇఇసిఇ విభాగం సంయుక్తంగా గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. ప్రపంచంలోని వివిధ దేశాలు వందకు పైగా అంతరిక్ష ప్రయోగాలు జరిపినప్పటికి చంద్రుడిపై నీటి జాడలను గుర్తించిన ఘనత మాత్రం భారత్‌కే దక్కిందని చెప్పారు. ఈ ఏడాది రష్యా, జపాన్ తదితర దేశాలు చేసిన ప్రయోగాలు విఫలం కాగా ఇస్రో చంద్రయాన్ విజయం సాధించడం వెనక వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు కారణం అన్నారు. భారత అంతరిక్ష ప్రయోగాలు విజయ వంతం కావడంతో ఇతర దేశాలు సహకారం కోరుతూ ముందుకు వస్తున్నాయని తద్వారా పెద్దఎత్తున ఆర్థిక వనరులు లభిస్తాయని పేర్కొన్నారు. అంతరిక్ష ప్రయోగాలలో ఉపగ్రహల బరువును నిర్ధేశించడంలో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆయన వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరక్టర్ ప్రొఫెసర్ కె.నాగేంద్రప్రసాద్ మాట్లాడుతూ విక్రమ్ సారాబారు వేసిన పునాది ఫలితంగా భారత దేశం అంతరిక్ష రంగంలో దూసుకు వెళుతోందని అన్నారు. కార్యక్రమంలో ఇఇసిఇ విభాగాధిపతి ప్రొఫెసర్ బి.సెవెన్త్‌లైన్, గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జిసిజిసి) డైరక్టర్ వంశీ కిరణ్ సోమయాజుల, డాక్టర్ ఉమాదేవి, డిప్యూటీ డైరక్టర్ ఎ.అనిల్ కుమార్, కాంపిటెన్స్ డెవలప్‌మెంట్ డైరక్టర్ డాక్టర్ రోజినా మాథ్యూస్, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం, వివిధ విభాగాల అధ్యాపకులతో సమావేశమయ్యారు.