ప్రజాశక్తి - ఎఎన్‌యు : పరిశోధనాత్మక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని 76 మంది ప్రొఫెసర్లకు ఒకేసారి ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల సీడ్ గ్రాంట్ అందించారు. వర్సిటీలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఛీఫ్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్, ప్లానింగ్ సెక్రటరీ ఎం.గిరిజా శంకర్ హాజరై మాట్లాడారు. పరిశోధనాత్మక విద్య నిరంతరం కొనసాగాలని, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల అధ్యయనాలు, పరిశోధనలు సమాజానికి అవసరమని అన్నారు. నూతన ఆవిష్కరణల కోసం వర్సిటీ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్థినేనని గుర్తు చేశారు. విలువలతో కూడిన విద్యా విషయక పరిశోధనాత్మక విద్యను విద్యార్థులకు అందించడానికి ఇలాంటి అద్భుతమైన సాహసోపేతమైన నిర్ణయాలను వీసీ ప్రొఫెసర్ పి.రాజశేఖర్ తీసుకోవడం శుభ పరిణామమని చెప్పారు. అనంతరం సీడ్ గ్రాంట్ ధ్రువ పత్రాలను ప్రొఫెసర్లకు గిరిజా శంకర్ అందించారు. కార్యక్రమంలో వీసీతోపాటు రెక్టార్ పి.వర ప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ బి.కరుణ, ప్రొఫెసర్ సంధ్యాకోల్ పాల్గొన్నారు.
మంజూరు పత్రాలు అందిస్తున్న గిరిజా శంకర్










