May 22,2023 23:38

మొక్కలు నాటుతున్న విసి ప్రసాదరెడ్డి

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రాంగణాన్ని పర్యావరణహితంగా మలచాలని ఏయూ వీసీ ఆచార్య పివిజిడి ప్రసాదరెడ్డి సూచించారు. సోమవారం ఉదయం ఏయూ హార్టికల్చర్‌ విభాగంలో ఔషధ, అలంకరణ, నీడనిచ్చే మెక్కల పెంపకాన్ని ప్రారంభించారు. వర్సిటీ అధికారులతో కలసి మెక్కలను నాటారు. వర్షాకాలం ప్రారంభమయ్యే సమయానికి వర్సిటీలో ప్రణాళికా బద్దంగా మెక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. పక్షులకు ఆశ్రయం ఇస్తూ, ఆహ్లాదాన్ని పంచే విధంగా ఉండే మెక్కలను ఎంపిక చేయాలన్నారు. భవనాలకు సమీపంలో కాకుండా దూరంగా మెక్కలను నాటి, పెంచాలని సూచించారు. వర్సిటీలో వృక్షాలు పెంచడానికి అనువైన ప్రాంతాలను గుర్తించి, విద్యార్థులను భాగం చేస్తూ మెక్కలు నాటే కార్యక్రమం త్వరలో ప్రారంభిస్తామన్నారు. దీనికి అవసరమైన మెక్కలను వర్సిటీలో సొంతంగా తయారుచేసే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా వర్సిటీ స్వయంగా అభివృద్ధి చేస్తున్న నర్సరీలో పలు మెక్కలు, వాటి ప్రత్యేకతలను వీసీ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య కె.సమత, ప్రిన్సిపల్స్‌ ఆచార్య ఎ.నరసింహారావు, వి.విజయలక్ష్మి, టి.శోభశ్రీ, బ్యూటిఫికేషన్‌ విభాగం గౌరవ సంచాలకులు డాక్టర్‌ జి.వీర్రాజు, డాక్టర్‌ జె.ప్రకాశరావు, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.