ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : రాష్ట్రానికి నూతన ఆవిష్కరణలు ఎంతగానో అవసరమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి అన్నారు. చదువు పూర్తయ్యాక ఉద్యోగాల్లో చేరడమే కాకుండా పరిశ్రమలను స్థాపించి పలువురికి ఉద్యోగాలను కల్పించాలని సూచించారు. నూతన ఆవిష్కరణల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక కెఎల్ యూనివర్శిటీలో 'ఆంధ్రప్రదేశ్ ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్'ను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టమవు తుందన్నారు. రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 18 వర్సిటీల్లో భోధనా పద్ధతులను సమూలంగా మార్పు చేయడంతోపాటు విద్యార్థులు సమాజంలో అనుభవం ద్వారా నేర్చుకునే విద్యా విధానాన్ని తెస్తామని అన్నారు. గతంలో ఉన్న ఆరు నెలలు ఇంటెన్షిప్‌ను వర్చువల్ ఇంటెన్షిప్‌గా మార్పులు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు తరగతి గది బయట అనేక విషయాలను నేర్పడానికి జిల్లా ఉన్నతాధికారులతో కమిటీ వేస్తున్నట్లు చెప్పారు. వీసీ డాక్టర్ పార్ధసారదివర్మ మాట్లాడుతూ తమ వర్శిటీలో ఉన్న ఎసిఐసి కేంద్రం ద్వారా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరూ నూతన ఆవిష్కరణలు చేపట్టవచ్చని చెప్పారు. రూ.ఐదు కోట్ల వరకు ఎసిఐసి పరిధిలో నిధులు ఉన్నాయన్నారు. నూతన ఆవిష్కరణ చేపట్టిన విద్యార్థి పరిణితి ఆధారంగా రూ.10 లక్షల నుండి రూ.40 లక్షల వరకు నిధులు మంజూరవుతాయని వివరించారు. కార్యక్రమంలో పో వైస్ చాన్సలర్లు డాక్టర్ ఎవిఎస్.ప్రసాద్, డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావు, ఎంహెచ్ ఎస్.డీన్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, ఆర్ అండ్ డి డైరెక్టర్ డాక్టర్ కె.శరత్, ఎసిఐసి సిఇఒ వి.రమణ్‌కాంత్, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఉమామహేశ్వరి, కెఎల్ టిప్ సిఇఒ అలోక్ గోవిల్, మేనేజర్లు బాబు హరికృష్ణ, టి.మహేష్ గౌడ్ పాల్గొన్నారు.










