Oct 15,2022 23:53

బస్సు కారిపోవడంతో తడిసి ముద్దయిన ప్రయాణికులు

ప్రజాశక్తి- సీలేరు : వర్షాలకు ఆర్టీసీ బస్సులు కారిపోతుండడంతో ఈ డొక్కు బస్సులు మాకొద్దు, కొత్త బస్సులు వేయండి అంటూ ప్రయాణికులు వేడుకుంటున్నారు. విశాఖ, మధురవాడ డిపోలకు చెందిన రెండు ఆల్ట్రో డీలక్స్‌ బస్సులను విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలానికి నైట్‌ సర్వీస్‌లు నడుస్తున్నాయి. ఇవి కాలం చెల్లినవి కావడంతో అవి ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాయో తెలియని దుస్థితి నెలకొంది. శనివారం ఉదయం విశాఖపట్నం డిపో నుంచి అల్ట్రా డీలక్స్‌ బస్సు 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరింది. నర్సీపట్నం వచ్చేసరికి ఎడతెరిపి లేకుండా బోరు వర్షం పడుతుండడంతో బస్సు పూర్తిగా కారిపోయింది. ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. ఏం చేయాలో ప్రయాణికులకు తెలియక దిక్కు తోసని స్థితిలో తడుచుకుంటూ బస్సులోనే ఉండి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. అధిక ఛార్జీలు వసూలు చేస్తూ ఇటువంటి బస్సులు ఏర్పాటు చేయడమేటని ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించగా అధికారులు ఏ బస్సులు నడపమంటే ఆ బస్సుల్ని నడపాలి తప్ప తాము ఏమీ చేయలేమని చెప్పారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు కళ్ళు తెరిచి ప్రయాణికులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సుదీర్ఘ ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులను కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు.