Sep 12,2023 23:35

ప్రజాశక్తి - భట్టిప్రోలు
కురిసిన కొద్దిపాటి వర్షానికే వందల ఎకరాలలో వరి పంట ముంపుకు గురవుతుంది. మురుగు నీటిపారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వేలాది రూపాయలు వెచ్చించి సాగు చేసిన వరి పంట నీటి పాలవుతుంది. గత మూడు రోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికి భట్టిప్రోలు బాడవ పొలంలో సుమారు 50ఎకరాలకుపైగా నీట మునిగింది. నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట నీటిలోనే కుళ్ళిపోతుంది. మండలంలోని ఐలవరం పరిధిలో ఉన్న బాడవ పొలం ప్రతి ఏట అధిక వర్షాలకు ఏదో రూపంలో దెబ్బతింటూనే ఉంది. ఈ పొలాల్లో వర్షపు నీరు బయటికి వెళ్లేందుకు ఉన్న ప్రధాన మురుగు కాలువ లంక బీడు సమీపంలో కాలువ కూడిపోవడం, కాలవకు అడ్డుగా పెద్ద పెద్ద చెట్లు విరిగిపడటంతో వర్షపు నీరు పారుదలయ్యే పరిస్థితి లేదు. దీనివలన పొలాల్లో ఉన్న నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో వేసిన వరి నాట్లు నీటిలోనే దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికే వరి నాట్లు పూర్తి కావడంతో మరోమారు నాటేందుకు నారు అందుబాటులో లేదని, దెబ్బతిన్న పొలాన్ని ఏమి చేయాలో అర్థం కావటం లేదని రైతుల వాపోతున్నారు. 15రోజుల క్రితం వరి నాట్ల సమయంలో కురిసిన వర్షానికి వేసిన నాట్లు దెబ్బతినడంతో రెండవ విడత నాటు వేశామని, ప్రస్తుతం మరోమారు వర్షానికి పొలం ఒంపుకు గురైందని, నాటు వేయడానికి కూడా ఎక్కడ నారు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.10వేల వరకు వెచ్చించామని, మరోసారి అప్పుచేసి సాగు చేద్దామన్న వరి నారు దగ్గరలో దొరికే పరిస్థితి లేదని రైతు అందే మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

పూడికతీతలు చేపట్టకపోవటమే కారణం
ముంపుకు గురయ్యే పొలాలకు ఉన్న మురుగ కాలువలను ప్రోక్లైన్లతో పూడికతీత చేపడితేనే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. మురుగు కాలువలను కూడా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టడం వలన దానిలో యంత్రాలు వినియోగించే పరిస్థితి లేకపోవడంతో పూడికతీత అలాగే మిగిలిపోతుందని రైతులు అంటున్నారు. దీంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. కూలీలకు ఉపాధిని కల్పించే ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ప్రధానమైన మురుగు కాలువలు కూడా కూలీల ద్వారా చేపట్టడంతో ఎక్కడ పూడిక అక్కడే ఉండిపోయి నేడు పొలాల ముంపుకి గురికావాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ అధికారులు కూడా మురుగు నీటిపారుదలపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రైతులు చెబుతున్నారు. 15రోజుల క్రితం కురిసన వర్షాల నీటిని తరలిస్తామని అధికారులు చెప్పిన హామీ అమలు కాలేదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీటి పారుదలకు మోక్షం కల్పించాలని రైతులు కోరుతున్నారు.