Jul 28,2023 21:04

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉండండి
- రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
- రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     రాష్ట్రంలో భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో శుక్రవారం తాడేపల్లి నుంచి సిఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌, జిల్లా ఎస్పీ కె.రఘువీర్‌ రెడ్డి, డిఆర్‌ఒ పుల్లయ్య తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ వరద ప్రాంతాల్లో పర్యటించాలని, ముంపు ప్రాంతాలు, పంటపొలాలను సందర్శించి బాధితులకు అండగా నిలవాలని ఆదేశించారు. మానవత్వంతో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేయాలని, లోతట్టు, మునక ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు, సహాయ శిబిరాలకు తరలించేందుకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల్లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మండల, సచివాలయం స్థాయిలో సమాచార సేకరణ ఉండాలని, వాలంటీర్లను అప్రమత్తం చేయాలన్నారు. మునక ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతంలో నీటి దిగ్బంధనంలో ఉన్న ప్రజలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్‌, ఎర్రగడ్డ, ఉర్లగడ్డలు తదితర రేషన్‌ అందించాలని సూచించారు. ఇందుకు ఎంఎల్‌ఎస్‌ స్టాక్‌ పాయింట్లు, ఎఫ్‌పి షాపులలో రేషన్‌ సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తాగునీటి ప్యాకెట్లు పంపిణీకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో నీరు తగ్గి సహాయ శిబిరాల నుంచి ఇళ్లకు పంపేటపుడు కుటుంబానికి రూ. 2 వేలు, ఒక్కరే ఉంటే రూ. వెయ్యి ఇవ్వాలని తెలిపారు. వర్ష గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దష్టి పెట్టి అన్ని చోట్లా బ్లీచింగ్‌, హెల్త్‌ క్యాంప్స్‌ చేయాలన్నారు. సిహెచ్సి, పిహెచ్సిలు, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లలో మందులు స్టాక్‌ ఉంచుకోవాలని సూచించారు. వర్షాలకు పాములు వస్తాయి కావున యాంటీ డోస్‌ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. దెబ్బతిన్న పాకలు, గుడిసెలు, గృహాలు తదితర ఆస్తి నష్టం వివరాల అంచనా నివేదికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల వల్ల చెరువులు, వాగులు, వంకల పరివాహక ఆర్‌ అండ్‌ బి రహదారుల్లో నీటి ప్రవాహాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్‌ అండ్‌ బి ఎస్‌ఈని ఆదేశించారు. తాగునీటి పైపు లైన్లు, రక్షిత మంచినీటి పథకాల్లో నీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈకి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిపిఒను ఆదేశించారు. జల వనరులు, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖలు నదుల్లోని నీటి నిల్వలు, పై ప్రాంతాల నుండి వస్తున్న వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. అధికారులందరూ సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని తెలిపారు.