
ప్రజల అవస్థలు
ప్రజాశక్తి - ఆచంట
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నాలుగు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని ఆచంట కచేరి సెంటర్‌లో ఉన్న ఆచంట మార్టేరు ఆర్‌అండ్‌బి ప్రధాన రహదారి నీట మునిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మండలంలో ఈ వర్షాలకు ప్రధాన రహదారులు, లింక్ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు అధ్వానంగా మారాయి. మండలంలో ఆచంట, కొడమంచిలి, కోడేరు, కందరవల్లి కరుగోరుమిల్లి భీమలాపురం వల్లూరు, పెనుమంచిలి, ఆచంట వేమవరం, పలు గ్రామాల్లో ఈ వర్షాలకు రహదారులు అధ్వానంగా మారాయి. పలు పల్ల ప్రాంతాలు జలమలమయ్యాయి. నివాస ప్రాంతాల కాలనీల్లో సీసీ డ్రెయిన్‌లు నిర్మించకపోవడంతో వర్షాలకు ప్రధాన రోడ్లు సైతం జలమలమయమవుతున్నాయి. సీసీ రోడ్లు ఎత్తుగా నిర్మించడం వల్ల కచ్చా డ్రెయిన్‌లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేక సమీపంలోని గ్రావెల్ మెటల్ రోడ్లు నీట మునుగుతున్నాయి. దీంతో నివాస ప్రాంతాల చుట్టూ కూడా వర్షపు నీరు చేరుతుంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో అనేక అంటు రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి రహదారులపై నిలిచిపోతున్న వర్షపు నీటిని బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెనుమంట్ర : పొలమూరు నుంచి నౌడూరు సెంటర్ వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. వర్షాలకు మరింత అధ్వానంగా తయారైంది. రోడ్డుపై గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజు వందల సంఖ్యలో వాహనాల రాకపోకలకు ప్రధాన రహదారి అయినా అధికారులు స్పందించడంలేదని విమర్శిస్తున్నారు. నెలమూరు నుంచి మడుగు పోలవరం, పెనుమంట్ర నుంచి జుత్తిగ వెళ్లే రహదారి కూడా అధ్వానంగా ఉంది.
ఆకివీడు : వర్షాలతో రోడ్లన్నీ మురికి గుంటలుగా మారాయి. రైల్వే స్టేషన్ రోడ్డు పరిస్థితి దుర్భరంగా మారింది. ఆకివీడు ప్రధాన జాతీయ రహదారి నుంచి రైల్వేస్టేషన్‌కి వెళ్లే దొరగారు చెరువుగట్టు రోడ్డు మొత్తం చిన్న చిన్న చెరువులుగా మారింది. ఆ రోడ్డుపై ప్రయాణం నరకప్రాయంగా తయారైంది. ఆ రోడ్డుపైన పది గ్రామాలకు చెందిన ప్రజానీకం రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ఇక ప్రతినిత్యం రైల్వే స్టేషన్‌కు వచ్చి వెళ్లే వేలాదిమంది ఆ రోడ్డు గుండానే ప్రయాణించాలి. ఆ రోడ్డులో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుం టున్నాయి. అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. వెంటనే రోడ్లపై గోతులు పూడ్చాలని కోరుతున్నారు.
మొగల్తూరు : గ్రామాల్లోని పలు రహదారులపై వర్షపు నీరు నిలిచి మడుగులను తలపించాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రమైన మొగల్తూరులో పక్కా డ్రెయినేజీ వ్యవస్థ లేకపోవడంతో రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.