- సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి - కాకినాడ
రెండు రోజులనుండి కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్న ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెదపూడి, సామర్లకోట, కాజులూరు, పిఠాపురం, గొల్లప్రోలు కొత్తపల్లి మండలాల్లో ఇప్పటికే పంట కోసి, ధాన్యం రాసులు పోసారని, ధాన్యం రాసులు తడిచి నీరు నిల్వ వల్ల మొలక వచ్చే ప్రమాదం ఉందని, అకాల వర్షం వల్ల ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఇప్పటికే జిల్లాలో బొండాలు ధాన్యం అధికంగా పండించిన రైతులు రేటు లేక నష్ట పోతుంటే, ఈ అకాల వర్షాలతో ప్రైవేట్ ధాన్యం కొనుగోలుదారుల వల్ల మరింత నష్ట పోనున్నారని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్‌బికెలు తక్షణం రైతులకు సహకారంగా నిలవాలని ఆ వైపుగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. వర్షాలు తగ్గిన తరువాత పంట నష్టం నమోదుకు చర్యలు చేపట్టాలని రాజశేఖర్ కోరారు.
ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
కాజులూరు మండలంలోని పలు ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాల్లో ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబుమంగళవారం పర్యటించారు. వర్షాల వల్ల నష్టపోయిన కౌలు రైతులు, రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో 15శాతం కోతలు మాత్రమే పూర్తి ఆయ్యాయని మిగతా పంట పొలాలు వరి కోతలు జరగలేదని ఈ వర్షం వల్ల పూర్తిగా మోకాళ్ళ లోతు నీటిలో పొలాలు మునిగి పోయాయన్నారు. . కాగా 75 కేజీలకు ధాన్యానికి రూ.1500 పైబడి ధర ఉందని మిల్లర్లు రూ.1300కే కొనుగోలు చేస్తున్నా రన్నారు. ప్రభత్వ పర్యవేక్షణ లోపం వల్ల ఐదు ఎకరాలు చేస్తున్న కౌలు రైతుకు రూ.50 వేల మేర నష్టం వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఆర్‌బికెల ద్వారా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అన్ని విధాల రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో అల్లాడి నరసింహమూర్తి నామాచందర్రావు సాలాది నారాయణ సోడిశెట్టి శ్రీను నామ సత్తిబాబు సోడిశెట్టి చిన్న యాల ఏడుకొండలు సత్తిబాబు, రైతులు పాల్గొన్నారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు
తాళ్లరేవు : అకాలవర్షాల కారణంగా దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంఎల్‌ఎ దాట్ల సుబ్బరాజు డిమాండ్ చేశారు. తాళ్ళరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పత్తిగొంది గ్రామంలో వర్షాల కారణంగా పాడైపోయిన వ్యవసాయ పంటలను దాట్ల సుబ్బరాజు తెలుగుదేశం పార్టీ రైతు కమిటీ పరిశీలించారు. అకాల వర్షాలు కారణంగా పాడైపోయిన ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాలు ద్వారా బేషరతుగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు చెల్లి వివేకానంద, మట్టా ప్రభాకర్, గుత్తులు సాయి, ముమ్మిడివరం రైతు అధ్యక్షులు కాశి, ధూళిపూడి వెంకటరమణ తదితరులు ఉన్నారు.
ఉప్పంగలలో నీట మునిగిన వరి పనలు
అకాల వర్షాలు కురిసిన కారణంగా మండలంలోని ఉప్పంగలలో వరి చేలు మునిగిపోయి, చేతికి వచ్చిన పంట దెబ్బతిందని, ధాన్యం తడిచిపోయిందని రైతులు పితాని సత్యనారాయణ అన్నారు. రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకో వాలని కోరారు. గ్రామ సర్పంచ్ శాఖ శంకరుడు, లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు దవులూరి శ్రీరామచంద్రమూర్తి, సచివాలయ కన్వీనర్ చెల్లుబోయిన శ్రీనివాస్ పంట పొలాలను పరిశీలించారు. తాళ్ళరేవు, పోలేకుర్రు, పి. మల్లవరం గ్రాంటు, పత్తి గొంది తదితర చోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి. అకాల వర్షానికి నీట మునిగిన పంట పొలాలకు, తడిసిన ధాన్యానికి ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
ఉప్పంగలలో నీట మునిగిన వరి పనలను చూపుతున్న రైతులు, సర్పంచ్ శంకరుడు










