May 07,2023 00:42

మాట్లాడుతున్న జిల్లా ప్రత్యేకాధికారి జె.నివాస్‌

ప్రజాశక్తి-అనకాపల్లి : అకాల వర్షాల మూలంగా పంట నష్టం కలుగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించాలని అనకాపల్లి జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్యం కుటుంబ సంక్షేమం సంచాలకులు జె. నివాస్‌ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ సూచనలను అనుసరించి జిల్లాలో పల్లపు భూముల రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. వరి కోతలు చేపట్టకూడదని, ఉద్యానవన పంటలకు తగు రక్షణ చర్యలను చేపట్టాలని కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాలన్నారు. జిల్లాలో రబీలో వరి, కూరగాయలు, ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పంట పరిస్థితులపై ఆరా తీశారు. జిల్లాలో జరుగుతున్న జగనన్న కాలనీ ఇండ్ల నిర్మాణం, నాడు నేడు మొదలైన సంక్షేమ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ రవి పట్టన్‌ శెట్టి మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా స్వరూపం, పరిస్థితులు, పంటలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, డిఎంహెచ్వో డాక్టర్‌ ఏ హేమంత్‌, సిపిఓ జి రామారావు, మత్స్య శాఖ ఏడి లక్ష్మణరావు, డిఎల్‌ డిఓ మంజులవాణి, డిఎల్‌పిఓ శిరీష రాణి, పౌరసరఫరాల శాఖ డిఎం శ్రీలత, డిఎస్‌ఓ సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూడాలి
కె.కోటపాడు : ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా వైద్యాధికారులు చొరవ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ జై నివాస్‌ అన్నారు. శనివారం చౌడువాడ పీహెచ్సీని జిల్లా కలెక్టర్‌ రవి సుభాష్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ పథకాన్ని విసృతం చేస్తున్నామన్నారు. ఇందుకోసం వైద్యాధికారులను ప్రత్యేకంగా నియమిస్తున్నట్లు తెలిపారు. పీహెచ్సీల్లో అన్ని రకాల మందులు సిద్ధం చేస్తున్నామని రోగులకు నిర్వహిస్తున్న అన్ని రకాల టెస్ట్లు పీహెచ్సీలోనే జరిగేటట్టు చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ హేమంత్‌ పిహెచ్సి వైద్యాధికారులు సుబ్రహ్మణ్యం నిర్మల తదితరులు పాల్గొన్నారు.