ప్రజాశక్తి- అరకులోయ :అరకులోయ మండలం సుంకరమెట్ట పంచాయతీ పిరిబంధ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం వర్షాలకు నేల కూలింది. శిధిలావస్థకు చేరుకున్న ఈ పాఠశాల భవనమును తొలగించి వాటి స్థానంలో కొత్త పాఠశాల భవనం మంజూరు చేసి నిర్మించాలని ఎన్నిమార్లు ఆ పంచాయతీ సర్పంచ్ చినబాబు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు విన్నవించినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు.దీంతో, గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షానికి పాఠశాల భవనం పూర్తిగా కూలి పోయి నేలమట్టమయ్యింది.ఆదివారం సెలవు రోజు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. లేనిపక్షంలో పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
విషయం తెలుసుకున్న సుంకరమెట్ట పంచాయతీ సిపిఎం సర్పంచ్ గెమ్మెలి చిన్నబాబు హుటాహుటిన ఆ గ్రామానికి వెళ్లి నేల మట్టమైన పాఠశాల భవనంను పరిశీలించారు. వెంటనే పాఠశాల భవనం మంజూరు చేసి నిర్మాణం చేయాలని గెమ్మెలి చిన్నబాబు డిమాండ్ చేశారు. గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గతంలో గడప గడప కార్యక్రమం సందర్భంగా పిరిబంధను సందర్శించిన ఎమ్మెల్యే పాల్గుణకు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించినా కనీసం స్పందించ లేదన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తున్నామంటున్న వైసిపి రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి పివిటిజి గిరిజనులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విమర్శించారు. పాఠశాల భవనం మంజూరు చేయాలని పలుమార్లు చెప్పినా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా స్పందించి పిరివెంద్ర గ్రామంలో పాఠశాల భవనం నిర్మాణం చేసి పిల్లలకు చదువు అందించాలని డిమాండ్ చేశారు.
50 పీటిజీ కుటుంబాలు ఈ గ్రామంలో జీవిస్తున్నాయని సర్పంచ్ చిన్నబాబు తెలిపారు. సమాజంలో అభివృద్ధికి దూరంగా ఉన్న పీవీటిజి పిల్లలకు ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థమౌతుందన్నారు. ఈ కార్యక్రమంలో .పి జానిబాబు,కె.ఆనందరావు,కె.జానిబాబు సూపర్ వార్డు మెంబర్ రవి తదితరులు పాల్గొన్నారు.










