శ్రమదానంతో పూడ్చిన యువకులు
ప్రజాశక్తి-మారేడుమిల్లి
మండలంలోని జిఎం.వలస పంచాయతీ పరిధి ఉత్తలూరు, కొండవాడ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొట్టుకుపోయింది. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రావెల్ రోడ్డు వేశారు. గతంలో కురిసిన వర్షాల వల్ల ఈ రహదారి అధ్వానంగా తయారైంది. రహదారి మొత్తం పెద్దపెద్ద రాళ్లు తేలిపోయి కాలినడకన నడవడానికి కూడా వీల్లేకుండా ఉంది. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో గత్యంతరం లేక ఆయా గ్రామస్తులు శ్రమదానంతో గోతులను పూడ్చుకున్నారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మళ్లీ రోడ్డు పూర్తిగా పాడైపోయింది. దీంతో గురువారం గ్రామస్తులందరూ కలిసి రహదారి గోతులను పూడ్చుకున్నప్పటికీ వర్షాల వల్ల రోడ్డు మొత్తం అధ్వానంగా ఉంది. అత్యవసర సమయంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. అధికారులు స్పందించి తక్షణమే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.










