ఎండిపోతున్న వరి పైరు
ప్రజాశక్తి - చాట్రాయి
చాట్రాయి మండలం మెరక ప్రాంతం కావడంతో వర్షాధారమే పంటలకు ఆధారం.. అధిక ఎండల వలన పంట పొలాలలో బోర్లు లోని నీరు అడుగంటి పోవటంతో, సరైన వర్షాలు లేక వరి పైరు ఎండిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫానుల కారణంగా పడిన వర్షం తప్ప కాలానుగుణంగా సరైన వర్షాలు ఈ సంవత్సరం పడలేదని మండల రైతులు నిరాశ చెందుతున్నారు. అసలే మెట్ట ప్రాంతం కావడంతో వేల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేయించినా, ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. వరి పైరు పొట్ట దశలో ఉండగా తగిన నీరు లేక పోవడం వల్ల వరి కంకులలో తాలు గింజలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, సరైన ఎదుగుదల లేక దిగుబడి రావటం కష్టంగా ఉందని వాపోతున్నారు. రైతులు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎరువులు, పురుగు మందులు వాడి పంట చేతికి వచ్చే సమయంలో సరైన దిగుబడి రాక, తెచ్చిన అప్పులు తీర్చలేక, అప్పుల పాలై కొందరు రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై సంబంధిత మండల వ్యవసాయ అధికారి బి.శివశంకర్ వివరణ అడగగా మండలంలోని మొత్తం 11,500 ఎకరాలలో వరి పంట రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. మండలంలోని చాట్రాయి, పోలవరం, మంకొల్లులో తమ్మిలేరు రిజర్వు ప్రాజెక్టులోని నీరు వ్యవసాయానికి కాలువల ద్వారా రైతులు ఉపయోగించుకుంటున్నారన్నారు. నరసింహారావు పాలెం, చిత్తపూరు గ్రామాలలో నీటి సౌకర్యం లేక పంటలు ఎండిపోతున్నాయని తెలియజేశారు.










