Aug 31,2023 22:59

ఎండిపోతున్న పత్తి, వరి పంటలు
ప్రజాశక్తి - చింతలపూడి

        వర్షాలు పడకపోవడంతో 15 రోజుల నుంచి పత్తి, వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోందని వర్షాధారంపై ఆధారపడిన రైతులు దిగాలు చెందుతున్నారు. 15 రోజుల క్రితం వర్షాలు పడి మళ్లీ జాడ లేకుండాపోయింది. వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడంతో వరి పంటల పరిస్థితి దారుణంగా కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల పరిధిలోని రూ.16 వేల ఎకరాల్లో వరిపంట వేసినట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. నీరు లేకపోవడంతో వరినార్లు ఎండిపోతున్నాయని వర్షాధారంపై ఆధారపడిన రైతులు వాపోతున్నారు. మరో 15 రోజులు వర్షం కురవకపోతే ఎండల తీవ్రత మరింత పెరిగితే పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంటుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు బోరుబావులు ఉన్న రైతులకు ప్రభుత్వం 24 గంటలు కరెంటు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ మండలంలో అటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించడంలేదు. వర్షం రాకుంటే మండలంలో కొన్ని వందల ఎకరాల్లో పంటలు నష్టపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి.