
ప్రజాశక్తి - ముసునూరు
వర్షాభావంతో సాగునీరందక వరి పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి డిమాండ్ చేశారు. గురువారం ముసునూరు మండలం గుడిపాడులో సాగునీరందక ఎండిపోయిన వరి పంటలను సిపిఎం, ఎపి రైతు సంఘం, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పరిశీలించారు. ఎండిన వరి దుబ్బులతో రైతులు నిరసన వ్యక్తం చేశారు. నష్ట పరిహారమిచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎ.రవి మాట్లాడుతూ వర్షాభావం వల్ల గుడిపాడు పంచాయతీ రావికుంట చెరువులో నీరులేక సుమారు 50 ఎకరాల వరకూ సాగునీరందక వరి పంట ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.25 వేలకు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పారు. పంట పొట్టదశకు చేరుకున్న తర్వాత నీరందక పంట ఎండిపోయిందన్నారు. జలకళ పథకంలో పేద రైతులకు బోర్లు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి పేద రైతులకు ఉచిత బోరు పథకం అమలు చేయాలన్నారు. పంట నష్టాన్ని వెంటనే నమోదు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుసంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ కష్టపడి సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో రైతుకంట కన్నీళ్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని వర్తింపజేయాలన్నారు. ఉపాధి కోల్పోయిన రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు పామర్తి మధు, బాధితరైతులు సిహెచ్.వెంకట రత్నం, సిహెచ్.శివయ్య, కె.శ్రీరాములు, పి.రంగారా వు, దాసరి శ్రీను, బి.జయమ్మ, రైతులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి : వర్షాభావంతో సాగునీరందక వరి పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి తెల్లం దుర్గారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలో సాగునీరు అందక ఎండిపోయే స్థితికి వచ్చిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావం వల్ల సాగునీరందక వరి పంటలు ఎండిపోయే స్థితికి వచ్చాయని దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వరిపంట పొట్ట దశకు చేరుకున్న తర్వాత నీరందక పంట ఎండిపోయే పరిస్థితికి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి పేద రైతులకు ఉచిత బోరు పథకం అమలు చేయాలన్నారు. పంట నష్టాన్ని వెంటనే నమోదు చేసి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షులు జానకిరామిరెడ్డి, సిహెచ్.కొండలరావు పాల్గొన్నారు.
కుక్కునూరు:వర్షాల్లేక ఎండిపోయిన పత్తి, మిర్చి పంట రైతులను ప్రభుత్వం ఆదుకుని రూ.50 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని, రైతు రుణమాఫీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి యర్రంశెట్టి నాగేంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సిపిఎం ఆధ్వర్యంలో మాధవరంలో వర్షాల్లేక ఎండిపోయిన మిర్చి, పత్తి పంటలను పరిశీలించి, ఎండిన మిర్చి, పత్తి దుబ్బలతో రైతులతో నిరసన తెలిపారు. నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ వర్షాభావం వల్ల నీరు లేక మాధవరం పంచాయతీ పరిధిలో 50 ఎకరాలకుపైగా సాగునీరందక వరి, మిర్చి, పత్తి పంట ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలకు సాగునీరందక ఎండిపోతున్నాయని, మరోపక్క బ్యాంకులో అప్పుతీసుకుని ఎకరాకు రూ.25 వేలకుపైగా రైతులు పెట్టుబడి పెట్టారన్నారు. పంట పొట్ట, కాపు దశకు చేరుకున్న తర్వాత నీరందక పంట ఎండిపోతుందని, జలకళ పథకంలో పేద రైతులకు బోర్లు వేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి పేద రైతులకు ఉచిత బోరు పథకం అమలు చేయాలన్నారు. కష్టపడి సాగు చేసిన పంట ఎండిపోవడంతో రైతుల కంట కన్నీళ్లు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.30 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమాను వర్తింపజేయాలన్నారు. ఉపాధి కోల్పోయిన రైతులకు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి పనులు కల్పించాలని కోరారు. రైతుల బ్యాంకు రుణాలు మాఫీ చేసి, నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు షేక్ మహబూబ్ పాషా, యర్నం సాయికిరణ్, మేడిపల్లి బాబు, కోట మోహన్ రావు, దేవరాజు, తిరుపతిరావు పాల్గొన్నారు.