ప్రజాశక్తి-లక్కవరపుకోట : వర్షాభావంతో నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. మండలంలో ఇప్పటికీ వరినాట్లు పడని పొలాలను రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘం బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ జూన్, ఆగస్టు, సెప్టెంబర్‌లో వర్షపాతం లోటు వర్షపాతం వల్ల లక్కవరపుకోట, కొత్తవలస, భోగాపురం, వేపాడ, డెంకాడ మండలాల్లో పూర్తిస్థాయిలో వరినాట్లు పడలేదన్నారు. వాటిని కరువు మండలాలుగా ప్రకటించి, ప్రత్యామ్నాయ ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాట్లు వేయనిచోట ఎకరానికి రూ.20 వేలు చొప్పున ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. బీమా పథకాన్ని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టకుండా ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన నీటి వనరులు కల్పించాలన్నారు. పెట్రోల్, డీజిల్, పైపులు, నీటిఇంజిన్లు వంటివి రైతులకు సబ్సిడీపై ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి రాంబాబు, ఉపాధ్యక్షులు చల్లా జగన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, పాల ఉత్పత్తిదారుల జిల్లా కన్వీనర్ గొంప కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఇనాం భూముల రైతులకు పట్టాలివ్వాలి
కొత్తవలస : చిన్నిపాలెం ఇనాం రైతులకు పట్టాలివ్వాలని ఎపి రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తూరు గ్రామంలో ఇనాం రైతులతో ఆయన సమావేశమయ్యారు. చిన్నిపాలెం రెవెన్యూ పరిధిలో సుమారు 1200 ఎకరాలకు సంబంధించి రైతులకు ప్రభుత్వం హక్కులు కల్పించిందన్నారు. అప్పటినుండి రైతులు ఆ భూములను సాగు చేసుకుంటూ, జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇటీవల జిఎంఆర్ గ్రూపునకు చెందినవారు ఇనాందారుల నుంచి కొన్నట్లు పత్రాల సృష్టించి, 1200 ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు రైతులను బెదిరిస్తున్నారని చెప్పారు. రైతుల నుండి కొనుగోలు చేయకుండానే, హక్కులు రద్దయిన ఇనాందారు అమ్మారని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. భూములపై హక్కులు కాపాడుకొనేందుకు రైతులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, నాయకులు చల్లా జగన్, గాడి అప్పారావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.










