Aug 23,2023 20:55

ఎండిపోయిన పంటలను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

చింతకొమ్మదిన్నె : మొలక దశలోనే ఎండిపోతున్నా పంటలను ఇ-క్రాప్‌ చేసి రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రసూల్‌పల్లె, లింగారెడ్డిపల్లి, దౌలతాపురం, ఎల్‌ఆర్‌ పల్లి గ్రామాలలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్లో అత్యధికంగా 403.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా నేటికీ సాధారణ వర్షపాతం కింద 191.6 మి.మి మాత్రమే నమోదైందని పేర్కొన్నారు. పది సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సంవత్సరం 60 శాతం విత్తనం పడే అవకాశాలు లేవన్నారు. లోటు వర్షపాతంతో 20.8 శాతం మాత్రమే సాగు అయిందని తెలిపారు. విత్తనాలు మొలక దశలోనే ఎండిపోతున్నాయని తెలిపారు. కరువు పరిస్థితులు కారణంగా అధికారులు గ్రామ స్థాయిలో పర్యటనలు జరిపి ప్రత్యామ్నాయ సహాయక చర్యలు చేపట్టేందుకు రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు. ఆర్‌బికె అధికారులు ఇ-క్రాఫ్‌లోని నిబంధనలను సడలించి మొలక దశలో ఎండిపోతున్న పంటలను కూడా ఇ-క్రాప్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. గండికోట, మైలవరం, బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులో ఉన్న నీటిని కాలువలకు వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.