Oct 24,2023 21:26

పూర్తిగా ఎండిపోయిన వేరుశనగ పంట

        మడకశిర : ఖరీఫ్‌ సీజన్‌లో నియోజకవర్గంలో రైతులు ప్రధానంగా వేరుశనగ పంట సాగు చేశారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి ఏమాత్రం చేతికందకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఐదు మండలాల్లో పంట పూర్తిగా నష్టపోవడంతో విధిలేని పరిస్థితిలో రైతులు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏటా పంటలు సాగు చేసి నష్టాలు చవిచూస్తున్నామని, గత రెండేళ్లు వర్షాలు ఎక్కువగా కురవడంతో వేరుశనగ పంట చేతికందలేదని, ఈ ఏడాది చినుకు జాడే లేకపోవడంతో వేరుశనగ పంటను ఇప్పటికే తొలగించామని అన్నదాత లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది ఐదు మండలాల్లో 15,876 హెక్టార్లలో వేరుశనగ పంట సాగైంది. మడకశిర మండలంలో 1,846 హెక్టార్లు, రొళ్ల-4,002, గుడిబండ-4,600, అమరాపురం-2,170, అగళి మండలంలో 3,258 హెక్టార్లలో వేరుశనగ అష్టకష్టాలు పడి విత్తనం వేసినప్పటి నుంచి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయ. పంట చేతికొచ్చే సమయంలో కూడా వర్షం కురవకపోవడంతో పెట్టుబడి కూడా దక్కలేదని విధి లేని పరిస్థితిలో పంటను పశువులకు గ్రాసం కోసం తొలగిస్తున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తే కొంతవరకూ ఉపశమనం కలుగుతుందని, లేనిపక్షంలో రైతులు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. కావున ప్రభుత్వం నష్టపరిహారంతో పాటు పంటల బీమా అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.