Nov 05,2023 20:47

కుక్కడిలో ఎండిపోయిన వరిపంట

ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు గిరిజన రైతులకు శాపంగా మారాయి. అనుకున్నంత స్థాయిలో వర్షాల్లేకపోవడంతో ఏజెన్సీ ప్రాంతం కరువు ప్రాంతంగా కనిపిస్తుంది. జూలై చివరి వారం నుంచి ఆగస్టు వరకు మోస్తారు వర్షాలు కురవడంతో రైతులు ఎంత ఆశతో పొలం పనులు ప్రారంభించారు. 50 శాతం వరకు వరి నాట్లు పూర్తయిన తర్వాత సెప్టెంబర్‌ నుంచి నేటి వరకు సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో వరి పైరు ఎండిపోయి బీడు భూములుగా మారుతుంది. రోజురోజుకు కరువు పరిస్థితులు ఏర్పడడంతో రైతులు కరువు కోరల్లో కన్నీటి పర్వంతం అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సాగునీటి వనరుల ఉన్నా అభివృద్ధికి నోచుకోకపోవడంతో పంట పొలాలకు సాగునీరందని పరిస్థితి. దీంతో ప్రతి ఏటా రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు పండిస్తుంటారు. మండలంలోని దుడ్డుఖల్లు, కొత్తవలస, డుమ్మంగి, కుక్కిడి, ఇరిడి, ఎల్విన్‌పేట, మండ తదితర ప్రాంతాల్లో పంట పొలాలకు సాగునీరందక వరి పైరు ఎండిపోతోంది. తాడికొండ, పెద్దఖర్జ, రాయగడ జమ్ము, గొరడ, చాపరాయి బిన్నిడి ప్రాంతాల్లో ఊటనీరు ఆధారంగా వరి పండుతోంది. మరో వారం రోజుల్లోగా వర్షాలు కురవకుంటే పూర్తిస్థాయిలో కరువు ఛాయలు ఏర్పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కురుపాం ఏజెన్సీలోనూ కరువు ఛాయలు అలుముకున్నాయి.
కరువు మండలాలుగా ప్రకటించాలి
జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. రాష్ట్రంలో 103 ప్రాంతాలను కరువు మండలాలుగా ప్రకటించిన ప్రభుత్వం పై ఏజెన్సీ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి.
కోలక అవినాష్‌,
ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి.
రైతులకు నష్టపరిహారమివ్వాలి
గుమ్మలక్ష్మీపురం, కురుపాం ఏజెన్సీ మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించి గిరిజన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వేలాది రూపాయలు అప్పులు చేసి పంటలు వేసుకున్న రైతులు కరువు ఛాయలు చూసి కన్నీటి పర్వంతమవుతున్నారు.
మండంగి రమణ,
ఎంపిటిసి, చెముడుగూడ, గుమ్మ లక్ష్మీపురం మండలం .