Jul 27,2023 23:13

ఆమదాలవలస : కొత్తవలస వద్ద నీట మునిగిన పంట పొలాలు

- పొంగిపొర్లిన వాగులు, వంకలు
- చెరువులను తలపిస్తున్న పంట పొలాలు
- కోతకు గురైన రోడ్లు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి, జలుమూరు, లావేరు, పొందూరు, ఆమదాలవలస : బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలను వర్షపునీరు ముంచెత్తడంతో చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి పలుచోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. రహదారులు కోతకు గురయ్యాయి. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు పక్కకు ఒరిగాయి. ఒడిశాలో పెద్దగా వర్షాలు కురవకపోవడంతో వంశధార, నాగావళి, మహేంద్రతనయ నదులు సాధారణ స్థితిలోనే ప్రవహిస్తున్నాయి.

    జలుమూరు మండలం కూర్మనాథపురం సమీపంలోని 3 ఆర్‌ కుడి కాలువకు గండి పడింది. దీంతో కూర్మనాథపురం, రామయ్యవలస, తాళ్లవలస, గుగ్గిలి, గుండువలస, పాగోడు, కరవంజ తదితర గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాలు ముంపునకు గురైంది. పాగోడు సమీపంలోని 11 ఆర్‌ కాలువ నుంచి నీరు రోడ్డు పైకి చేరింది. కొమనాపల్లి, శ్రీముఖలింగం, మర్రివలస, అచ్యుతాపురం, నగరికటకం, కత్తిరివానిపేట, సురవరం, దంపాకు, తిమడాం, సైరిగాం, అల్లాడ, అంధవరం, పర్లాం, మాకివలస తదితర గ్రామాలకు చెందిన వేలాది ఎకరాలు నీటి మునిగాయి. పొందూరు మండలంలోని నారాయణపురం కుడికాలువ, రెల్లిగెడ్డ ఆయుకట్ట పొలాల్లో వరి పంట నీటి మునిగింది. చిలకపాలెం-పొందూరు రహదారిలోని మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ రహదారి వెంబడి గల కాలువలు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవడంతో వరదనీరు పోయే మార్గం లేకపోవడంతో నీటమునిగాయి. ఆమదాలవలస మండలంలోని దూసి, కొత్తవలస వద్ద పంట పొలాలు నీటమునిగాయి. చీమలవలస వద్ద నారాయణపురం ఎడమ కాలువ కట్టలు తెంచుకొని ప్రవహిస్తుండడంతో చుట్టుపక్కల పంట పొలాలు నీట మునిగాయి. కొర్లకోట సాగరం చెరువు సమీపంలోని పొలాలు నీట మునగడంతో నదిని తలపిస్తున్నాయి. మండలంలో 300 ఎకరాల వరకు పంట పొలాలు నీట మునిగాయి. కొర్లకోట, రావికంటిపేట, చీమలవలస, వంజంగి, దూసి, కనుగులవలస, ఆనందపురం తదితర గ్రామాల్లో పంట పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది.
తాడివలసలో పెచ్చులూడిన స్కూల్‌ శ్లాబ్‌
పొందూరు మండలం తాడివలస జిల్లాపరిషత్‌ ఉన్న పాఠశాలలోని తరగతి గదులు కారిపోయి నీరు చేరడంతో పాటు 9వ తరగతి గదిలో శ్లాబ్‌ పెచ్చులూడి బెంచీలపై పడ్డాయి. ఈనెల 26న రాత్రి జరగడంతో ఎవరికీ ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కోతకు గురైన రోడ్లు
లావేరు మండలంలో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులు కోతకు గురవడంతో విద్యుత్‌ స్తంభాలు పక్కకు వాలాయి. కొత్తరోతుపేట వద్ద చిట్టగెడ్డ వరద ఉధృతిలో ఒక యువకుడు మోటార్‌ సైకిల్‌పై రాత్రి పది గంటల సమయంలో వాగు ఉధృతంగా ప్రవహించే సమయంలో చిక్కుకోగా గ్రామస్తులు అతన్ని రక్షించి, మోటారు సైకిల్‌ను తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు. పెదరవుపల్లిలో విద్యుత్‌ స్తంభం విరిగింది. ఆ సమయంలో విద్యుత్‌ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దాబాల చెరువు ఉధృతికి చిన్నమురపాక, చిన్నరొంపివలస రహదారి కొట్టుకుపోయింది. వరద ప్రవాహంతో బెజ్జిపురం నుంచి కలిశెట్టిగూడం మార్గం గండి పడింది. మురపాకలో దుక్క భద్రయ్య పక్కా ఇళ్లు ముందు భాగం కూలిపోయింది. ఆ సమయంలో కుటుంబీకులు మరో గదిలో ఉండడంతో ప్రమాదం తప్పింది. మరో రెండు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
సాధారణ స్థితిలో నదీ ప్రవాహాలు
జిల్లాలో గురువారం అక్కడక్కడా చిరుజల్లులు తప్ప పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. ఎల్‌ఎన్‌పేట మండల కేంద్రం, కోవిలం ప్రాంతాల్లో గరిష్టంగా 1.75 మి.మీ వర్షం పడింది. ఒడిశాలో పెద్దగా వర్షాలు కురకపోవడంతో వంశధారలో నీటి ప్రవాహం తగ్గింది. నదిలోకి 7,678 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే పరిమాణంలో కిందికి వదులుతున్నారు. కుడి, ఎడమ కాలువలను మూసివేశారు. నారాయణపురం వద్ద నాగావళి నీటి ప్రవాహం 4,300 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మహేంద్రతనయలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. నదిలో ప్రస్తుతం 350 కూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి తగ్గడంతో పాతపట్నం మండల కేంద్రంలో కె.గోపాలపురం, ఎస్‌.గోపాలపురం మధ్య కాజ్‌వే రాకపోకలు పునరుద్ధరణ అయ్యాయి.