
ప్రజాశక్తి పుట్టపర్తి రూరల్ : శ్రీ సత్యసాయి జిల్లాకు చేరిన జగనన్న ఆరోగ్య సురక్ష మందులను భద్రపరచడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. సౌకర్యాలు లేకనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అధికారులు అంటున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది కనిపించడంలేదు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయక పోవడం వల్ల కోట్లాది రూపాయలు విలువచేసే మందులు వరండాలో నిల్వచేయడం విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వం అందజేసిన మందులను భద్రంగా ఉంచాల్సిందిపోయి ఇలా వదిలివేయడం ఎంతవరకు సబబని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈపరిస్థితి జిల్లాకేంద్రమైన డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో చోటుచేసుకుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద 32 మండలాల్లో హెల్త్ క్యాంపుల నిర్వహణ ద్వారా ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం మందులను సరఫరా చేసింది. శ్రీ సత్య సాయి జిల్లాలో 41 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వాటి పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులను జిల్లా వ్యాప్తంగా 397 వైద్య శిబిరాలు నిర్వహించాల్సుంది. వాటిలో రోజుకు 32 శిబిరాలను నిర్వహిస్తున్నారు. వీటికి సరిపడా మందులను జిల్లా కేంద్రాలకు తరలించారు.ఈ మందులను విడతల వారీగా ఆయా మండలాలకు తరలించి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుల ద్వారా రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో బాగంగా జిల్లాకు అవసరమయ్యే మందులను గత వారం రోజుల నుండి విడతల వారీగా డీఎంహెచ్‌ఒ కార్యాలయానికి చేరుతున్నాయి. ఈమందులను భద్రపరచుకుని ఆయా హెల్త్ సెంటర్లకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే కార్యాలయానికి వచ్చిన మందులను భద్రపచడంలో అధికారులు పూర్తిగా నిరక్ష్యం వహిస్తున్నట్లు అక్కడ మందులను ఉంచిన పరిస్థితిని బట్టి తెలుస్తోంది. అనుకోకుండా వర్షం వస్తే వర్షపు నీటిలో మందులు బాక్సులు పాడైపోయి నష్టం వాటిల్లుతుంది. మరోవైపు ఎలుకలుకూడా బాక్సులను కొరికే అవకాశం ఉంది. రోగులకు అందాల్సిన మందులు ఇలా పాడవడం వలన రోగుల ఆరోగ్యం ఎలా బాగుపడుతుందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. దీనిపై వైద్యాదికారిని వివరణ కోరగా మందులను భద్రపరచడానికి ప్రత్యేక గది లేకపోవడంవల్ల వరండాలోనే ఉంచాల్సి వచ్చిందన్నారు. త్వరలోనే ముందులను ఆయా కేంద్రాలకు పంపిణీ చేస్తామని చెప్పారు.