ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఈనెల 19న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగనున్న ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రజలంతా తిలకించేందుకు వీలుగా నగరంలో పలుచోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం ఎల్ ఎన్ రాజు తెలిపారు. నగరంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపం, భాష్యం స్కూల్ పక్కన గల గ్రౌండ్‌లో భారీ ఎల్‌ఇడి స్క్రీన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపాపు. క్రికెట్ ప్రేమికులు, క్రీడాకారులు, ప్రజలు, క్రీడాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత్ క్రికెట్ జట్టు విజయానికి మద్దతు అందించాలని కోరారు.
మహిళా పార్కులో బిగ్ స్క్రీన్
ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ ను మహిళా పార్కులో వీక్షించేందుకు భారీ స్క్రీను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి తెలిపారుశుక్రవారం మహిళా పార్కులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్లను విడుదల చేశారు. అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ తిలకించేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపాలని తెలిపారు. క్రికెట్‌ను తిలకించేందుకు ప్రత్యేకంగా టెంట్లు, కుర్చీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మ్యాచ్‌లో భారత జట్టు సిక్స్‌లు కొట్టే సమయంలో డ్రమ్స్ వాయిద్యాలతో మరింత ఉత్సాహభరితంగా భారత జట్టుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మ్యాచ్ తిలకించేందుకు మాత్రం మహిళలందరికి పూర్తి ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్క్ నిర్వహణ కమిటీ సభ్యులు ఉమా బాలాజీ తదితరులు పాల్గొన్నారు.