Aug 03,2021 20:14

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వర్కు ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేదిశగా రాష్ట్రంలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన డిజిటల్‌ లైబ్రరీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలకు మంచి సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్‌ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్‌తోపాటు గ్రాడ్యుయేట్స్‌ స్టూడెంట్స్‌కు ఉపయోగంగా డిజిటల్‌ లెబ్రరీలు ఏర్పాటు చేయాలని తెలిపారు. వాటిల్లో కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టులతోపాటు అన్నిరకాల పోటీపరీక్షలకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్‌ ఉంచాలని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ నుండే పనిచేసుకునే సదుపాయమూ కల్పించాలన్నారు. మొదటి విడతలో 4,530 లైబ్రరీలు నిర్మించేందుకు వీలుగా ఆగస్టు 15న పనులు మొదలుపెట్టాలన్నారు. స్టోరేజీకి సంబంధించి డేటా సెంటర్‌ నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురాలని సిఎం సూచించారు. అలాగే టేబుళ్లు, విజిటర్‌ కుర్చీలు, ఫ్యాన్లు, ఐరన్‌ ర్యాకులు, వార్తాపత్రికలు, మేగజైన్స్‌, డిజిటల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై అధికారలు మాట్లాడుతూ డిజిటల్‌ లైబ్రరరీల నిర్మాణాన్ని డిసెంబర్‌ నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని సిఎంకు వివరించారు. ఈ సమావేశానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌, ఎపిఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎమ్‌డి మధుసూదనరెడ్డి, టెక్నాలజీ సర్వీసెస్‌ ఎమ్‌డి ఎం.నందకిషోర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.