Oct 24,2021 12:26

      చాలా సంవత్సరాల తరువాత కుటుంబంతో కలిసి పుట్టిన ఊరికి వస్తున్నాడు రఘురామ్‌. అతనికి ఇక్కడకు రావడం అస్సలు ఇష్టం లేదు. ముఖం కొంచెం విసుగ్గానే ఉంది. రైలు దిగి, వాళ్లూరు చేరడానికి గుర్రపు బండెక్కాడు. కంకర రోడ్ల మీద బండి కుదుపులు మాటిమాటికీ ఎత్తి కుదేస్తుంటే అతను ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. ఆఫీసు నుంచి వస్తున్న ఫోన్‌కి మధ్య మధ్యలో సిగల్‌ కట్టవ్వడంతో కోపంతో శివాలెత్తుతున్నాడు. గుర్రం సకిలింపు, గిట్టల శబ్దం అతనికి కర్ణకఠోరంగా వినిపిస్తున్నాయి. పల్లె అంటే తెలియని రఘు భార్య నందనకి, పిల్లలకీ మాత్రం ఈ ప్రయాణం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. తమ సంతోషాన్ని చిరుబురులాడుతున్న రఘు కంట పడకుండా మొఖాల్లోనే ఒత్తుకుంటున్నారు. నలభై ఐదేళ్ల క్రితం పెళ్లయినప్పుడు తొలిసారి భర్తతో కలిసి గుర్రపు బండి మీద అత్తారింటికి (ఈ ఊరికి) వచ్చిన జ్ఞాపకాల్ని కళ్లల్లో కంటోంది రఘు తల్లి వనజాక్షి.
'ఎదవ కరోనా? ఏసీల్లో హాయిగా ఉండేవాణ్ణి తీసుకొచ్చి నా బతుకుని ఇలా మట్టిరోడ్డు పాల్జేసింది. ఎప్పటికి నార్మల్‌ అవుతుందో!? ఆ! సంకురుడు గాడికి ఎప్పట్నించో చెప్తున్నాను. ఊళ్లో ఉన్న ఇల్లూ, పొలం అమ్మేయవయ్యా బాబూ అని! వాడు వింటే కదా! పొలం అమ్మేస్తే బతుకుదెరువు పోద్దని వాడి స్వార్థం! అమ్మేసి ఉంటే ఇవేళ నాకు ఈ రోడ్లు, గుంతలు, ఊరి బాధలు తప్పేవి కదా?! ఇంట్లోవాళ్లకేమో అన్నీ సెంటిమెంటే. మనూరూ, మనిల్లూ అంటారు. ప్రపంచమంతా పరిగెత్తి ముందుకు పోతోంటే! వెనకటి ఆలోచనలతో వెనకెనక్కి చూస్తారు వీళ్లు. ఏం చేస్తాం? మన టైమ్‌ బ్యాడ్‌ అంతే!' అని వినబడీ వినబడనట్టు మనసులో గొణుక్కుంటున్నాడు రఘు.
ఇరవై ఏళ్ల నుంచి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ విలాసాల మధ్య గడుపుతున్న రఘు యాంత్రిక జీవితానికి కరోనా ఒక షాకిచ్చింది. తన కెరీర్లో ఇలాంటి మలుపోటి ఉంటుందని అస్సలు ఉహించలేదు. అనవసరంగా ఈ ఏడాది ఇండియాకొచ్చి, ఇరుక్కుపోయామని తెగ బాధ పడిపోతున్నాడు. మాట్లాడితే కుటుంబ సభ్యుల మీద ధ్వజమెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు.
రఘు ఐదోతరగతి వరకూ ఈ ఊళ్లోనే చదివాడు. వాళ్ల నాన్నగారికి ప్రమోషన్‌ రావడంతో హైదరాబాద్‌ వెళ్లి, అక్కడే స్థిరపడిపోయారు. నగరాల్లో చదువుకున్న రఘురామ్‌ ఉద్యోగాలకు విదేశీ బాటపట్టాడు. ఆ తరువాత ఎప్పుడూ ఇటు తొంగి చూడలేదు. నాన్న ఐదేళ్ల క్రితం కాలం చేశారు. హైదరాబాద్‌ ఇంట్లో అమ్మ వనజాక్షి ఒకత్తే ఉంటోంది. భార్యా పిల్లలతో అమెరికా నుంచి ఏడాదికోసారి హైదరాబాద్‌ వచ్చి, పదిరోజులుండి తిరిగి వెళ్తుంటాడు. సంకురుడు వాళ్ల కుటుంబానికి నమ్మిన బంటు. ఉద్ధారకుడుగా ఊళ్లో ఉన్న పొలం, మండువా లోగిలి బాగోగులు తనే చూసుకుంటున్నాడు. వనజాక్షి హైదరాబాద్‌లో ఉన్నా ప్రాణమంతా ఈ పల్లెమీదే.
ఏటా మాదిరిగానే ఈ ఏడాదీ రఘు కుటుంబంతో అమ్మ దగ్గరికి వచ్చాడు. ప్రపంచాన్ని చుట్టిన మహమ్మారి కరోనా వలయంలో రఘు ఇరుక్కున్నాడు. విమాన ప్రయాణాలు రద్దు కావడంతో తిరిగి అమెరికా వెళ్లడం సాధ్యంకాక ఇక్కడే చిక్కుకుపోయాడు రఘు. హైదరాబాద్‌లోనే ఉండి, వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ చేస్తున్నాడు. వాళ్లున్న అపార్టుమెంటులో పాజిటివ్‌ కేసులు పెరిగిపోవడంతో రోజురోజుకీ ఆంక్షలు పెరుగుతున్నాయి.
ఏదో ముక్కుమూసుకుని ఓపిక పట్టేస్తే విమానాలు తిరగ్గానే అమెరికాకి వెళ్లిపోదామనేది రఘు ఆలోచన. 'ఊరిలో విశాలమైన జాగాలో మనకి లంకంత కొంప ఉంది. అక్కడికి వెళితే ప్రాణం హాయిగా ఉంటుంది. ఎలాంటి వైరస్సులూ దరిచేరవు. ఆ ఊరు వెళ్లి మనం కూడా చానాళ్లయ్యింది. కోడలు పిల్లయితే అసలు చూడనే లేదు. ఈ సమయంలో అక్కడకి వెళ్లడం మనకి అన్నివిధాలా శ్రేయస్కరం' అంది అమ్మ. కోడలు, మనుమలు ఆమెకే మద్దతు పలికేశారు. రఘు తనకు ఇష్టం లేకపోయినా? వాళ్ల మాటకి ఊ కొట్టక తప్పలేదు. అలా అయిష్టంగా మొదలైన రఘు ఊరి ప్రయాణాన్ని చివరికి గుర్రపు బండి ఇంటికి చేర్చింది.
బండి దిగేసరికి సంకురుడు వాళ్లకి అన్ని ఏర్పాట్లూ చేసేశాడు. వనజాక్షి తన జ్ఞాపకాలతో ఇల్లంతటినీ తడిమేస్తోంది. నందన, పిల్లలు ఆ మండువా లోగిల్లో ప్రతిదీ తేరిపార చూస్తున్నారు. తన ల్యాప్‌టాప్‌కి కనెక్షన్‌ కుదరలేదని, నెట్‌ సిగల్‌ రావడంలేదని, వర్కంతా పెండింగ్‌ పడిపోతోందని తెగ మండి పడిపోతున్నాడు రఘు. క్షణాల్లో టెక్నీషియన్ని తీసుకొచ్చి, రఘుకి కావాల్సినట్టుగా రెడీ చేయించాడు సంకురుడు.
'హా! పల్లెల్లో కూడా టెక్నాలజీ సర్వీస్‌ బానే ఉంది! వెల్‌డన్‌' అన్నాడు రఘు కాస్త మొఖంలో నవ్వు పులుముకుంటూ. ఎప్పుడూ ల్యాప్టాప్‌ మెళ్లో వేసుకున్నట్టే పనిలో కనిపిస్తాడు రఘు. తన పని నిరాటంకంగా సాగిపోతుండటంతో రఘులో చిటపటలు తగ్గుతున్నాయి.
వీళ్లింటికి ఒక ఇల్లు అవతల ఎదురుగా ఉన్న శోభనాద్రి గారి ఇంటిదగ్గర ఒకరోజు ఇరుగూ పొరుగూ చేరి ఆడ, మగా అని తేడా లేకుండా అంతా గబగబా పనులు చేసేస్తున్నారు. అది చూసిన రఘుకి ఆశ్చర్యమనిపించింది. వెంటనే అమ్మను అడిగాడు. 'అదా! ఇవేళ శోభనాద్రిగారి ఇల్లు పెంకు నేస్తున్నారు. నేత ఒక పూటలో పూర్తయిపోవాలి. వర్షం వస్తే మట్టి మిద్దె నానిపోయి, ఇల్లు కూలిపోతుంది. అందుకే వాళ్లంతా హడావిడిగా పనిచేస్తున్నారు. ఇక చుట్టూ ఉన్నవాళ్లకి ఏమి అవసరం అంటావా? గ్రామ సాంప్రదాయాల్లో గొప్పతనం అదే మరి. ఇవేళ ఈయనకు అవసరం ఉంది వాళ్లంతా పనిసాయం చేశారు. రేపు వాళ్లకు అవసరమైనప్పుడు ఈయన వెళ్లి సాయం చేస్తాడు. దీన్నే బదలాయింపు పనులు అంటారు!' అంది అమ్మ. పక్కోడేమైనా పట్టిచ్చుకోని యాంత్రిక వాతావరణంలో మసులుతున్న రఘుకి ఈ విషయం వింతగా అనిపించింది.
మరో రోజు ఇంటికెదురుగా ఉన్న కానుగచెట్టు మీంచి ఓ కూనిరాగం వినిపిస్తోంది. ఆతృతగా చూడ్డానికి వీధి గుమ్మం దగ్గరకు వెళ్లారు. చెట్టు చుట్టూతా జనం చేరి, కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. చెట్టు కింద పరిచిన వస్త్రం పప్పులు, బియ్యం, కూరగాయలతో నిండుతోంది. మరికొంత మంది డబ్బులు వేస్తున్నారు. బఫూన్‌ టోపీ, చిరిగిన కొల్లాయి వేసుకుని, మొకానికి మాసికల్లా రంగులు పూసుకుని తోలుబొమ్మలాటలో కేతిగాడిలా ఉన్న ఒకతను చెట్టెక్కి చిటారు కొమ్మ నుంచి రాగాలు తీస్తున్నాడు. గమ్మత్తయిన మాటలతో ఇట్టే నవ్వించేస్తున్నాడు. చెట్టు మీంచి దూకేస్తానని బుడ, బుడ రాగాలు తీస్తున్నాడు. కింద వాళ్లు వద్దు.. వద్దని బుజ్జగిస్తూ నవ్వేసుకుంటున్నారు. వాళ్లకి తోచింది వస్త్రంలో వేసి, సాయం చేస్తున్నారు.
పిల్లలు ఉత్సాహాన్ని ఆపుకోలేక ఇదేంటని సంకురుడుని అడిగారు. 'పల్లెల్లో ఇదో జానపద కళ. తను కొమ్మదాసు. తన కళతో ఆబాలగోపాలానికి సంతోషాలు పంచి.. వారిచ్చే తులమో, ఫలమో తీసుకుని పొట్ట నింపుకుంటాడు' అని చెప్పాడాయన.
'మరి మా ఊళ్లోకి రారేంటి వీళ్లు?' అని అడిగింది మనుమరాలు సవిత.
'మీ పట్నంలో అంతా కాంక్రీటు వనాలే. వీళ్లు ఎక్కడానికి చెట్లెక్కడుంటాయి. ఒకవేళ ఉన్నా ఆ బిజీబిజీ నగర జీవితాల్లో వీళ్లని పట్టించుకునేవాళ్లు ఎవరుంటారు. చెట్లెక్కి అరిసీ, అరిసీ సొమ్మసిల్లి పడిపోవడం తప్ప' అని చమత్కరించాడు సంకురుడు.
రఘు ఇప్పుడు కాస్త రిలాక్సేషన్‌గానే ఉంటున్నాడు. అమెరికాలోలా కాకుండా వీలు దొరికినప్పుడల్లా ముఖాన్ని ల్యాప్‌టాప్‌ నుంచి బయటకుతీసి, కుటుంబంతో ముచ్చటిస్తున్నాడు. రఘులో ఈ మార్పుకి తల్లీ, భార్యా ఉప్పొంగిపోతున్నారు. రఘు వర్క్‌ ఫ్రమ్‌ హోంకి ఒక రోజు వీకెండ్‌ సెలవు దొరికింది. టూర్‌ వెళదామని నెట్లో గాలించాడు. అమెరికాలోలా ఎంటర్టైన్మెంట్‌ సెంటర్లు ఎక్కడా కనిపించలేదు. కొంచెం నిరాశపడ్డాడు. ఇంతలో సంకురుడు పాలు తీసుకొచ్చాడు.
'ఎమోరు ఉద్ధారకా! ఇక్కడ దగ్గర్లో చూడ్డానికి ఏముంటారు?' అడిగాడు రఘు.
'ఎక్కడికో ఎందుకండి? మన పొలమే వెళదాం!' అన్నాడు సంకురుడు.
'పొలమా? మేమా?' అన్నాడు రఘు.. మొఖం అదోలా పెట్టి.
'ఏం బాబు? మీ పొలం మీరు చూసుకోరా!?' అన్నాడు సంకురుడు. పిల్లలు వెళదామని గోల చేశారు. నందని కూడా 'ఒకసారి మన పొలాలు చూసొద్దామండీ!' అంది. 'ఒరేరు! అది మన తరతరాల జీవన గని, నీకు గుర్తులేదేమో? చిన్నప్పుడు మీ నాన్నగారు నిన్ను ఎత్తుకుని, పొలం తీసుకెళ్లేవారు' అంది తల్లి మధ్యలో అందుకుని. 'ఒకే! రెడీ అవ్వండి! రేపు వెళదాం!' అన్నాడు రఘు.
అంతే! పిల్లలు ఎగిరి గంతేశారు.
మరునాడు అందరూ పొలంబాట పట్టారు. సంకురుడు చేతికర్ర పట్టుకున్నాడు. ముందు, వెనుకాల వీళ్లు
నడుస్తున్నారు. దారిపొడుగునా ఒకటే పలకరింపులు.
'ఎవర్రా వీళ్లు' దారిలో ఒకాయన సంకురుడుని అడిగాడు.
'మన గోపాల్‌రావుగారి కుటుంబం, అమెరికా నుంచి వచ్చారు.' అని సంకురుడు సమాధానం.
'అమ్మా వనజాక్షిగారు బావున్నారా?' మరో రైతు పలకరింపు. 'ఈ రఘుబాబుని ఎప్పుడో? చిన్నప్పుడు చూశాను. వీళ్ల నాన్నా నేనూ స్నేహితులం. వీళ్లిక్కడున్నప్పుడు నేను తరచూ వీళ్లింటికెళ్లేవాడిని, ఆడు బాగా చదువుకోబట్టి ఆఫీసరయ్యాడు. 'నాన్నెలా ఉన్నాడు బాబు?' తలపాగా చుట్టుకున్న మరో రైతు అడిగాడు.
'నాన్నగారు కాలం చేసి ఐదేళ్లయ్యిందండి' సన్నగా చెప్పాడు రఘు.
'అయ్యో! అలా జరిగిందా? నేనూ ఊళ్లో ఉండటంలేదు.. అబ్బాయి వాళ్లదగ్గర హైదరాబాద్‌లోనే ఉంటున్నా. ఈ మధ్యే వచ్చాను.. నాకు తెలీదు. మీ నాన్న చాలా మంచోడు. నేనిలా అడిగేనని ఏమీ అనుకోకు' అంటూ తలపాగా తీసి చమర్చిన కళ్లు ఒత్తుకుంటూ ముందుకెళ్లి పోయాడాయన. మరో ఐదు నిముషాలు నడిచేటప్పటికి పొలం వచ్చేసింది. అక్కడంతా వేల ఎకరాల మాగాణి. కనుజూపు మేరలో వత్తుగా పండిన వరికంకులు. నేల మీద పసిడి తివాచీ పరిచినట్లు గాలికి ఇటూ అటూ లయబద్ధంగా ఊగుతూ కనువిందు చేస్తున్నాయి. మధ్యలో ఒరుసుకుని పారే కాలువలు, వాటిలో వెళుతోన్న చిన్ని చిన్ని నావలు, గట్ల నిండా మగ్గిన ఫలాలతో ఆకుపచ్చని చెట్లు, వాటి మీంచి వివిధ రకాల పక్షుల గమ్మత్తయిన కూతలు అణువణువూ వాళ్ల కళ్లను కట్టిపడేస్తున్నాయి. దూరంగా చేల మధ్యలోంచి వెళుతోన్న రైలుబండి పాము జరాజరా పాకుతున్నట్లు కనిపిస్తోంది. కళ్లెదుట బోదెల్లోంచి నీళ్లు ఉరకలు వేస్తుంటే ఎగిసిపడుతున్న చేప పిల్లలు సందడి చేస్తున్నాయి. చెట్ల నుంచి వచ్చే చల్లని గాలులు వారిని సేద తీరుస్తున్నాయి. మాటల్లోనే సంకురుడు బొప్పాయిలు కోసి, చకచకా చెక్కేసి ముక్కలు చేసి, ఆకుల్లో పెట్టి వాళ్ల చేతికందించాడు.
సహజమైన వాతావరణంలో చెట్టు కింద కూర్చొని తేనెలూరు తియ్యని బొప్పాయిని ఆరగిస్తూ ఎంతో మధురానుభూతి పొందుతున్నారు వాళ్లంతా. ఇంతలోనే కొబ్బరి బొండాలు తెచ్చి, వాళ్లకందించాడు. బొప్పాయి ఆకుల సన్నటి దూటను గొట్టాల్లా చెక్కి వాళ్ల కళ్లెదుటే స్ట్రాలుగా మలచి, ఇచ్చాడు. చల్లటి గాలిలో తియ్యటి నీళ్లు తాగుతుంటే జీవితంలో ఎప్పుడూ పొందలేని అనుభూతి కలుగుతోంది వాళ్లకి. తాగేసిన బోండాలు పగులగొట్టి , పలచగా పాకుడు కట్టిన గుజ్జును చెక్కి, వాటి తొక్కనే స్పూన్‌గా మలిచి 'చాలా బాగుంటుంది, తినండంటూ' చేతులకిచ్చాడు సంకురుడు. నోట్లో పెట్టగానే కమ్మగా, తియ్యగా గొంతులోకి జారిపోతున్న ఆ కొబ్బరి తాయిలం తింటుంటే ఫారిన్లో వాళ్లు తిన్న ఏ రుచీ దీనికి సరి రావడం లేదు.
ఓ మహిళల గుంపు వరి చేలు కోస్తూ పాడుతున్న జానపదానికి తన్మయత్వంతో గంతులు వేస్తున్న లేగదూడ సొగసులకి వాళ్లంతా పరవసించిపోతున్నారు. గూడులో ఉన్న తన కూన నోట్లో గిజుగాడు ఆహారం తినిపించడం, కారుమబ్బుల ఆకాశంలో తెల్లని కొంగల గుంపుల్లా చిత్రవిచిత్ర ఆకృతుల్లో స్వైరవిహారం వాళ్లని అడుగడుగునా ఆకట్టుకుంటున్నాయి.
వనజాక్షి ఇంటి నుంచి తెచ్చిన పులిహోర, అన్నం, పప్పూ, ఆవకాయ పచ్చడి అరటి ఆకుల్లో వడ్డించేసింది. చేల గట్ల మీద నడిచి అలసిపోయి దంచేస్తున్న ఆకలితో వాళ్లకి ప్రతిదీ మరింత మధురంగా ఉంది. ఒక్కొక్కటీ ఎంతో ప్రీతిగా ఆరగిస్తున్నారు. ఆ పొలాల మధ్య భోజనం చేస్తుంటే విహారయాత్రలో వన భోజనాలు చేస్తున్నంత అనుభూతి కలుగుతోంది వాళ్లకి. తరువాత నుయ్యి, దానిలో తాబేళ్లు, అరవిరిసిన తామర తుండుల కొలను, పక్కనే కొండల మీద జింకలు, పెద్ద పాములపుట్ట, జీడిమామిడి తోటలో కోతుల గుంపు, పూలతోటలపై ఎగురుతున్న రంగుల సీతాకోకచిలుకలను ఒక్కొక్కటిగా చూపిస్తూ వాటి గురించి సంకురుడు చెప్తూ ఉంటే.. వాళ్లు తేరిపార చూస్తున్నారు. ఆధునిక మైకపు పరదాలేవో ఒక్కొక్కటిగా కరిగిపోతూ రఘు గుండెల్లో చిన్నప్పటి జ్ఞాపకాలేవో కలుక్కుమంటున్నాయి. ఈ మట్టితో ఉన్న బంధమేదో తనని పిలుస్తున్నట్లనిపించింది. రఘులో ఏవేవో ఆలోచనలు వేగంగా కదులుతుండగా వారు ఇంటిబాట పట్టారు.
మరునాడు ఉదయం వాళ్లింటికి ఒకాయనొచ్చాడు. రెండు చేతుల్లో రెండు నిండు సంచీలతో గుమ్మంలో నిలబడ్డాడు. 'యావండీ!' అని పిలిచాడు. నందన బైటకొచ్చి 'ఎవరు కావాలి?' అంది.
'గోపాలరావుగారబ్బాయి రఘుబాబు ఉన్నారా?' అని అడిగాడు.
'ఊ' అని గదిలోంచి పిలిచింది.
నైట్‌ డ్రెస్సులో ఉన్న రఘు, ల్యాప్‌టాప్‌ దగ్గర నుంచి కళ్లజోడు సర్దుకుంటూ 'ఎవరంటూ' బయటకి వచ్చాడు. మీకెవరు కావాలన్నట్టు అతని వైపు చూశాడు. చెరకు ముక్కలు, తేగలు, అటుకులు ఉన్న సంచులు 'మీకే' అన్నట్టు గుమ్మంలో పెట్టాడు.
రఘు సందేహిస్తుండగా వాళ్ల అమ్మ వచ్చి, అవి తీసుకొంది. 'రా బాబు లోపలికి' అని పిలిచి, 'మీరెవరు బాబు?' అని అడిగింది. లోపలికి వచ్చి జేబులోంచి పదివేల రూపాయలు తీసి, రఘుకి ఇచ్చాడు. రఘుకి మరింత అయోమయంగా ఉంది. 'నా పేరు మోహిత్‌, నేను శ్యామ్‌ వాళ్ల అబ్బాయిని. మా నాన్నగారు, మీ నాన్నగారు చిన్ననాటి స్నేహితులు. మీ నాన్నగారు ఆరేళ్ల క్రితం పుష్కరాలకి ఈ ఊరొచ్చినప్పుడు మా ఇంటికొచ్చారు. నాన్నకి అప్పుడు ఒంట్లో బాలేదు. మంచం మీద ఉన్నారు. గోపాలరావుగారు నాన్నకి పదివేల రూపాయలు ఇచ్చి, వైద్యం చేయించుకోమన్నారు. నాన్న తీసుకోవడానికి ససేమిరా అంటే.. ఊరికనే వద్దులే చేబదులుగా తీసుకోమన్నారు. ఆ డబ్బుతో పట్నంలో వైద్యం చేయించాము. నాన్న చక్కగా కోలుకున్నారు. సమయానికి గోపాలరావుగారు డబ్బివ్వకపోతే ఇవేళ నాన్న మాకుండేవారు కాదు. ఆ తరువాత గోపాలరావు గారు కాలం చేశారని తెలిసి, నాన్న చాలా ఏడ్చారు. ఎవరైనా వస్తే అందజేద్దామని నాన్న డబ్బులు బీరువాలో దాచారు. మీరు ఊళ్లోకి వచ్చినట్టు నిన్ననే సంకురుడు ద్వారా తెలిసింది. మా నాన్నది, గోపాలరావుగారిది ఆర్థిక అరమెరికలు లేని గొప్ప స్నేహం. నాన్న కాస్త నీరసంగా ఉన్నారు. లేకుంటే ఆయన కూడా వచ్చేవారు' అంటూ డబ్బులిచ్చేసి, వనజాక్షికి చేతులు జోడించి, తమ కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయాడు.
జరిగిన పరిణామానికి రఘు, నందన నిశ్చేష్టులైపోయారు. సబిత 'నానమ్మా నాకు తెలియదు చేబదులంటే ఏంటో చెప్పవా?' అని అడిగింది.
'ఎవరైనా ఆపదలో ఉంటే తెలిసినవాళ్లు కానీ, బంధువులు కానీ డబ్బు సర్దుబాటు చేస్తారు. మళ్లీ వీళ్లకు చేయి తిరిగిన తరువాత ఇచ్చేస్తారు. దీన్నే చేబదులు అంటారు. గ్రామాల్లో మనుషులకుండే పరపతి ఇది' అని చెప్పింది నానమ్మ.
ఊరి గొప్పదనం, నాన్న మంచితనం, మనుషుల ఔన్నత్యం, జీవిత లాలిత్యం అన్నీ వదులుకుని పరాయిగడ్డపై పాకులాడటం, కాలంతో పరుగుపెట్టడం, యాంత్రిక సైగలకు సై అనడం అవసరమా? అనుకుంటూ మీమాంసలో పడ్డాడు రఘు. తెల్లవారింది, కాసేపటికి సంకురుడు ఓ వ్యక్తిని వెంటబెట్టుకుని వచ్చాడు. 'ఎవరీయన' అని అడిగింది వనజాక్షి. 'రఘుబాబు గురించి వచ్చారు. ఎప్పటి నుంచో ఇంటికీ, పొలానికి బేరం తీసుకురమ్మని అడుగుతున్నారుగా? ఈయన పక్కూరులో బెల్లం షావుకారు. కొనుక్కుంటానంటే తీసుకొచ్చానమ్మా' అన్నాడు సంకురుడు. 'గదిలో ఫోన్‌ మాట్లాడుతున్నాడు, ఆఫీసువాళ్లతో అనుకుంటా వచ్చేస్తాడు. సోఫాలో కూర్చోండి' అందామె.
లోపల ఫోన్లో రఘు మాటలు హాల్లో వీళ్లకు వినిపిస్తున్నాయి. వాళ్ల కంపెనీలోనే పనిచేస్తున్న స్నేహితుడు సత్యంతో మాట్లాడుతున్నాడు రఘు. 'సత్యం! నేను త్వరలో అమెరికా ఉద్యోగానికి రిజైన్‌ చేస్తున్నాను. నాన్నిచ్చిన పొలం చూసుకుంటూ, ఈ ఇంట్లోనే ఉంటూ ప్రాజెక్టు వర్కు చేసుకుంటాను. అన్నీ సెటిల్‌ చేసుకుని వచ్చే ఏడాది అట్లతద్దె మా ఇంట్లో ఘనంగా జరుపుకోవాలనేది నా గట్టి నిర్ణయం' అనేసి ఫోన్‌ పెట్టేశాడు. మాటలు చెవిన చేరగానే మరో సమాధానం అవసరం లేకుండా మోతుబరి తిరుగుముఖం పట్టాడు. అమ్మ, నందన, పిల్లలు మోఖాల్లో ఇప్పుడే తద్దెకాంతులు విరిశాయి.

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506