Mar 23,2023 21:21

         జంగారెడ్డిగూడెం:మెట్ట ప్రాంతంలో అత్యధిక ప్రాధాన్యత కలిగిన వాణిజ్య పంట వర్జీనియా పొగాకు అమ్మకాలు, కొనుగోళ్లు గురువారం ప్రారంభమయ్యాయి. గురువారం స్థానిక ఒకటో వేలం కేంద్రం(18)లో 27 పొగాకు బేళ్లు, వేలం కేంద్రం-2 (32)లో 99 మేలురకం పొగాకు బేళ్ల అమ్మకానికి రైతులు సిద్ధం చేశారు. ఉదయం 8:30 గంటలకు ఒకటో వేలం కేంద్రంలో ప్రారంభమైన వేలంలో కిలో పొగాకు అధిక ధర రూ.210 లభించింది. అలాగే రెండో వేలం కేంద్రంలో కూడా అధిక ధర రూ.210 లభించింది. ఈ నేపథ్యంలో పలువురు పొగాకు రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం పెట్టుబడులు పెరిగాయని పలువురు వాపోయారు. కనీసం కిలో పొగాకు ధర రూ.250 దక్కితే గానీ రైతులు కోలుకోలేరని చెబుతున్నారు. గత ఏడాది పొగాకు అమ్మకాల్లో కిలో సరాసరి ధర రూ.191 మాత్రమే లభించిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది కనీసం సరాసరి ధర రూ.230 ఉండాలని వర్జీనియా పొగాకు రైతులు ఆశిస్తున్నారు. కొనుగోలు కంపెనీలు రైతాంగంపై దృష్టిసారించి కిలో పొగాకు కనీస ధర రూ.250 కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే పొగాకు వేలం నిలిపివేస్తామని ప్రారంభ దశలోనే రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నిరాశ జనకంగా పొగాకు ధరలు : ఎపి రైతు సంఘం
వర్జీనియా పొగాకు వేలం ప్రారంభ రోజునే నిరాశజనకంగా ధరలు ఉండడం పట్ల ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో వర్జీనియా పొగాకు కొనుగోళ్లు కనీస ధర అంశంపై ఆయన మాట్లాడారు. ఉత్పత్తి ఖర్చులు దారుణంగా పెరిగిపోయాయని చెప్పారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధర రాకపోతే పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వర్షాల వల్ల జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, టి.నరసాపురం మండలాల్లో వేలాది ఎకరాల్లో వర్జీనియా పొగాకు తోటలకు తీవ్రనష్టం జరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో సరాసరి ధర కిలో వర్జీనియా పొగాకు రూ.300 ధర ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కనీస ధరలు రాకపోతే వర్జీనియా పొగాకు రైతులు ఆందోళనలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, జిల్లా కమిటీ సభ్యులు సిరిబత్తుల సీతారామయ్య పాల్గొన్నారు.