Oct 25,2023 20:29

పంటలను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి - కొత్తవలస : రైతులు వరి పంటను ఆకు ముడత, దోమపోటు నుంచి రక్షించడానికి తగిన మందులు పిచికారి చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎంఎం శ్రీనివాసరావు, డాక్టర్‌ తేజేశ్వరరావు తెలిపారు. బుధవారం కొత్తవలస సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఉన్న కొత్తవలస, లక్కవరపు కోట మండలాల్లో వ్యవసాయ సహాయ సంచాలకులు విజయ, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు డాక్టర్‌ ఎంఎం శ్రీనివాస రావు, డాక్టర్‌ తేజేశ్వరరావు వరి క్షేత్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకు ముడత, దోమ ఉన్నట్టు గుర్తించినట్లు తెలిపారు. ఆకుముడత నివారణకు 20 యస్‌సి ఎకరానికి 60 మిల్లి లీటర్లు మందును వాడాలని, చిరుపొట్ట దశలో అయితే కార్తాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 2 గ్రాములు లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి అని తెలిపారు. ప్రస్తుతం గాలిలో తేమ, ఉష్ణోగ్రత అధికంగా ఉండటం వల్ల దోమ ఆశించిందని దోమ నివారణకి పైమెట్రోజైన్‌ మందును ఎకరకు 120 గ్రాములు వాడాలని తెలిపారు. ఎడిఎ విజయ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు అనుకున్నంత లేనందున రైతులు అందరూ చెరువుల్లో ఉన్న నీటిని భాగస్వామ్య పరస్పర సహకార పద్ధతిలో వరి క్షేత్రాలను కాపాడుకోవా లన్నారు. చిరు పొట్ట దశకు చేరుకోవటానికి వీలున్న చోట మల్టీ కేను 2 కిలోలు ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు. ఈ కార్యక్ర మంలో రెండు మండలాల వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
వేస్ట్‌ డికంపోజర్‌ రైతుకి వరం
బొబ్బిలి: వేస్ట్‌ కంపోజర్‌ రైతుకు వరమని వ్యవసాయ శాఖ ఎడి ఎం.శ్యామసుందర్‌ అన్నారు. మండలంలోని కృష్ణాపురంలో వేస్ట్‌ కంపోజర్‌ తో సాగు చేస్తున్న పంటలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరకమైన ఆవు పేడ, మూత్రం నుంచి తీసిన జీవరాశులతో ఒక పదార్దాన్ని తయారు చేస్తారని చెప్పారు. వేస్ట్‌ కంపోజర్‌ ను వినియోగిస్తే రసాయనిక ఎరువులు వాడకుండా వ్యవసాయం చేయవచ్చునని చెప్పారు. కృష్ణాపురంలో మూడేళ్ల నుంచి 100మంది రైతులు 100ఎకరాల్లో వేస్ట్‌ డీకంపోజర్‌తో సాగు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సాగుతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చునని చెప్పారు. కార్యక్ర మంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, పాల్గొన్నారు.