
ప్రజాశక్తి-రోలుగుంట: వరి పంటలో సమగ్ర యాజమాన్య చర్యలు చేపట్టడంపై బిసిటి కృషి విజ్ఞాన
కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ అవగాహన కల్పించారు. శుక్రవారం మండలంలోని శరభవరం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆత్మ సౌజన్యంతో వరి పంటలో కీలక యాజమాన్య పద్ధతులపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మిత్ర పురుగులను సంరక్షించుకోవడంతో పురుగుమందుల అవసరం లేకుండానే చీడపీడలను అదుపులో పెట్టవచ్చని, సకాలంలో కలుపు యాజమాన్యం ద్వారా తెగుళ్లు ఆశించకుండా పంటను కాపాడుకోవచ్చన్నారు. కేవలం నిర్దేశించిన మోతాదులో మాత్రమే ఎరువులను వాడటంతో తెగుళ్లు రాకుండా చూసుకోవచ్చని వివరించారు. సాయంత్రం వేళ పొలంలో నీరు పూర్తిగా తీసేసి బాగా తడిచేలా పిచికారి చేయడంతో అధిక శాతం చీడపీడలను నియంత్రించవచ్చునని వివరించారు. మొదటి దఫా ఎరువులలో కచ్చితంగా 25 కిలోల పొటాష్ వాడడంతో తెగుళ్లు ఆశించడాన్ని నివారించవచ్చని, ఇప్పటికే పొటాష్ వాడకపోవడంతో చాలా పంటలలో, ముదురు ఆకుల చివర్ల నుంచి, అంచుల నుంచి ఎండిపోతున్నట్టుగా గమనించామని సేద్య శాస్త్రవేత్త డాక్టర్ వాన ప్రసాదరావు అన్నారు. మిగిలిన 25 కిలోల పొటాష్ ఎరువులను అడుగు పొట్ట దశలో తప్పనిసరిగా వాడడంతో నాణ్యత పెంచవచ్చునని వివరించారు. కలుపు మందులను వినియోగించడం ద్వారా ఎకరాకు కేవలం 1500 రూపాయలతోనే కలుపును అదుపులో పెట్టవచ్చని సాంప్రదాయ పద్ధతిలో సుమారు నాలుగువేల పైనే ఖర్చు అవుతుందన్నారు. పొలంబడి విశేషాలను వ్యవసాయ అధికారిని విజయలక్ష్మి వివరించారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ శ్రావణి, ప్రకృతి వ్యవసాయ అధికారులు సాయి లక్ష్మి, సాంబమూర్తి పాల్గొన్నారు.