Nov 21,2023 21:16

వరిలో తెల్లచీడ

వరిలో తెల్ల చీడను నివారించండి
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
ముందెన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఈశాన్య రుతుపవన వర్షాలు ముఖం చాటేసాయి. దీంతో జిల్లాలో కేవలం 10 శాతం వరకే వరిని బోర్లు కింద నాట్లు వేశారు. పిలకల దశలో ఉన్న ఈ పైరును తెల్లచీడ (ఆకు ముడత) ఎక్కువగా ఆశించి నష్టపరుస్తోందని తిరుపతి వ్యవసాయ శాఖ జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ మెరుగు భాస్కరయ్య ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పురుగు ఆకులలోని పచ్చదనాన్ని తినేసి, ఆకులను తెల్లగా మారుస్తోంది. పురుగు తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులు చుట్టుకున్నట్లు కనిపిస్తాయి. మొక్కలు బలహీన పడి, దిగుబడిపై ప్రభావం చూపుతుంది . పైరుకు ఎక్కువగా యూరియా వేయడం, యూరియాతో గుళికల మందు కలిపి వేయడం, ఈ పురుగు ఉధతిని పెంచుతుంది. పైరుకు ఒకసారి ఎకరాకి 40 కిలోలకు మించి యూరియా వేయకూడదు. పైరులో ఆకులు తెల్లగా కనిపించిన తొలి దశలోనే క్లోరిపైరిపాస్‌ (ఎకరానికి 500 మి. లి) మందును స్ప్రే చేస్తే పురుగు అదుపులో ఉంటుంది. పురుగు ఉధతి ఎక్కువగా ఉండి, ఆకులు గుళ్లుగా కనిపిస్తే, పైరు పై మొదట ముళ్లకంపతో లాగాలి. దీనివలన ఆకులలోని పురుగులు కింద నీటిలో పడి నశిస్తాయి. తర్వాత ఎసిఫేట్‌ (ఎకరానికి 300 గ్రాములు) లేదా కార్టప్‌ హైడ్రోక్లోరైడ్‌( ఎకరాకు 400 గ్రాములు) స్ప్రే చేసి పురుగులు నివారించవచ్చు.
వరిలో తెల్లచీడ