Jun 21,2023 00:33

ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో మంత్రి తదితరులు పరిశీలన

ప్రజాశక్తి - విజయపురిసౌత్‌, మాచర్ల : పల్నాడు ప్రజల చిరకాల వాంఛ అయిన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం సాకారం కానుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పనులకు వచ్చేనెలలో సిఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఈ మేరకు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ కెఎఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌తో కలిసి మంత్రి రాంబాబు మంగళవారం పరిశీంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లుగా వరికపూడిశెల నిర్మాణ పనులు శంకుస్థాపనకే పరిమితం కావడం, అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పల్నాడు ప్రాంత ప్రజలు ఇప్పటివరకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ 60 ఏళ్లుగా ఈ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌ కావడంతో కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇచ్చేందుకు ముందుకు రాలేదని, అటువంటి తరుణంలో కేంద్ర మంత్రులతో సిఎం మాట్లాడి అనుమతులను తెచ్చారని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతం కావడం, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉండడంతో, అనేక అడ్డంకులు నడుమ కేంద్ర అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లు తెలిపారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేయడం వల్ల వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లలచెరువు మండలాల రైతులకు సాగునీరు, తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ ఇప్పటికి తాను రెండుసార్లు వరికిపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రాంతాన్ని సందర్శించినట్లు తెలిపారు. 1996, 2008లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదన్నారు. తాజాగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడమే కాకుండా తొలి దశలో నిధులు మంజూరు చేసి పనులు పనులు ప్రారంభం జరిగేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, ఎం.శ్రీనివాసశర్మ, ఎంపీపీ చింత శివరామయ్య, తాడిశెట్టి వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కుర్రి సాయిమార్కొండారెడ్డి, మాచర్ల జెడ్‌పిటిసి ఎం.స్వామి, నాయకులు బి.శ్రీను, ఉమామహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా తొలుత మాచర్లలోని ప్రభుత్వాస్పత్రిలో రూ.3 కోట్లతో నిర్మించిన 50 పడకల ఆస్పత్రి భవనాలను మంత్రి రాంబాబు ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి ఆసత్రి అవసరమని సిఎంను కోడిన వెంటనే మంజూరు చేశారని చెప్పారు. వరికపూడిశెల పనులను తొలిదశలో రూ.350 కోట్లతో చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలతో కూడిన విమర్శళు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌, వైఎస్‌ఆర్‌ పార్టీ యువజన సంఘం నాయకులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, తురకా కిషోర్‌, రఘురామిరెడ్డి, తాడి వెంకటేశ్వరరెడ్డి, బివి రంగారావు, క్రిష్ణమూర్తి పాల్గొన్నారు.