Nov 14,2023 23:44

మాచర్ల పట్టణంలోని సభా వేదిక వద్ద ఏర్పాట్లు

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : పల్నాడు, ప్రకాశం జిల్లాల ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, 'వైఎస్సార్‌ పల్నాడు కరువు నివారణ పథకం' కింద రూ. 340.26 కోట్లతో చేపట్టనున్న వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మాచర్లలో శంకుస్థాపన చేయనున్నారు. ఇటీవల అటవీ, పర్యావరణతో పాటు అన్ని అనుమతులూ రావడంతో ఈ పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మొదటి విడత వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు. బొదిలవీడు, గంగలకుంట, కండ్లకుంట గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 20 వేల మంది జనాభాకు తాగునీరు అందుతుంది. రాష్ట్రంలో పూర్తిగా పైపులైన్ల ద్వారా నీరందించే తొలి ప్రాజెక్ట్‌ వరికెపూడిశెల అని అధికారులు తెలిపారు. 4 పంపుల ద్వారా 281 క్యూసెక్కుల నీటి సరఫరా చేస్తారు. 57 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సాగు, తాగు అవసరాలకు సరఫరా చేస్తారు.
ఇప్పటికే అటవీ ప్రాంతంలో పంప్‌ హౌస్‌ నిర్మాణానికి నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ వైల్డ్‌ లైఫ్‌, అటవీ, పర్యావరణ విభాగాల నుండి కీలకమైన అనుమతులతో ఇక పనులకు శ్రీకారం చుట్టనున్నారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నది జలాలను మళ్లించి వెనుకబడిన మెట్ట ప్రాంతాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. ఈ ఏడాది మే 19న వన్యప్రాణి సంరక్షణ అనుమతులు రాగా నవంబరు 6న అటవీ అనుమతులు వచ్చాయి. ఈ అనుమతులతో అన్ని అడ్డంకులు తొలగి పనుల ప్రారంభానికి ప్రాజెక్టు సిద్ధమైంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2018, 2019లో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో ఇచ్చిన హామీల్లో వరికపూడిశెల కూడా ఒకటి. అయితే ఇంకా అనేక హామీలు కార్యరూపం దాల్చలేదు.
పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో రూ. 500 కోట్లతో 47.53 ఎకరాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నిర్మాణం నత్తనడక సాగుతోంది. పల్నాడులో వైద్య సదుపాయాలు మెరుగుపడలేదు. పేరేచర్ల-కొండమోడు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం ఇంకా ప్రారంభంకాలేదు. గోదావరి, పెన్నా అనుసంధానం పనుల్లో కదలిక లేదు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌కు పరిపాలన ఆమోదం తెలుపుతూ నిధులు కేటాయించినా ఇంత వరకు టెండర్లు కూడా పిలవలేదు. పల్నాడు ప్రాంతంలోని ఏడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో తాగు, సాగునీటి కష్టాలు నిత్యకృత్యమయ్యాయి. పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పనుల్లో కొన్నింటికైనా మోక్షం లభిస్తుందో లేదో వేచిచూడాల్సిందే.