ఈపూరు: పల్నాడు జిల్లా ప్రజల చిరకాల ప్రాజెక్టు వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మాణపు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో ప్రారంభిస్తామని నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మండలంలోని ఇని మెళ్ళ, బొమ్మరాజుపల్లి గ్రామాల్ల నూతన సచివాలయం,రైతు భరోసా కేంద్రం,ఆరోగ్య కేంద్రాలను ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు తో కలిసి ఎంపి గురు వారం ప్రారంభించారు. ఇనిమెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎంపి, ఎమ్మెల్యే సందర్శించారు. లో ఓల్టేజీ సమస్యతో ఆర్‌ఓ ప్లాంట్ పనిచేయడం లేదని విద్యార్థులు బోరు నీరే తాగుతున్నారని,వ్యాయామ ఉపాధ్యాయులు లేక పిల్లలు ఆటలకు దూరంగా ఉన్నారని ఉపాధ్యాయులు వారి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తానని ఎంపి హామీ ఇచ్చారు. మెరుగైన ఫలితాల కోసం ఉపా ధ్యాయులు కృషి చేయాలని సూచించారు. అనంతరం మండల కేంద్రం ఈపూరులో ఎంపీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ నిధులు రూ. 80 లక్షలతో నూతనంగా నిర్మించిన మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని ఎంపిపి ఈదర రాధిక చేతుల మీదుగా ఎంపీ,ఎమ్మెల్యే ప్రారం భించారు. కార్యక్రమంలో జడ్పిటిసి తుర్లపాటి చౌడయ్య, ఎంపీ డీవో ఏవి రంగనాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ చుం డూరు వెంకటేశ్వర్లు, ఏవో రామా ఉద్యాన శాఖ అధికారి నవీన్ కుమార్, వైసీపీ మండల కన్వీనర్ కోపల దేవరాజ్,వైసీపీ నాయకులు శాఖమూరి బుచ్చయ్య, వెంకట హనుమయ్య పాల్గొన్నారు.










