ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా అభివృద్ధికి కీలకమైన వరికపూడిశెల ప్రాజెక్టు పనులను సత్వరమే చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఆదివారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటకు వచ్చిన ఆయన స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో విలేకర్లతో మాట్లాడారు. వరికపూడిశెలను అన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నాయని, ఇద్దరు ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా మరోసారి శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్నారని, అలా కాకుండా పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ పంటల ఇన్పుట్ సబ్సిడీ పరిమితంగా వచ్చిందని, పల్నాడు జిల్లాలో ప్రత్తి మిర్చికి ఇన్పుట్ సబ్సిడీ కింద రూ 2, 3 వేలు వచ్చాయన్నారు. ధరణ స్థిరీకరణ నిధి రూ .3 వేల కోట్లు ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.2వేల కోట్లు మొత్తం రూ.5 వేల కోట్లలో రూ.1176 కోట్లు విడుదల చేశారని రబీ సాగు నాటికి కేటాయించిన మిగిలిన నిధులను కూడా విడుదల చేసి రైతులకు ఆర్థిక తోడ్పడు అందించాలని కోరారు. ఒక ఎకరా సాగు చేయాలంటే మిర్చి విత్తనాలకు రూ.25-40 వేల వరకు రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తుందని, రైతు భరోసా కేంద్రాల సరసమైన ధరలకు అన్ని రకాల విత్తనాలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈపూరులో పట్టుబడిన నకిలీ విత్తనాల మూలాలను కనుక్కొని సంబంధిత శాఖ అధికారులు నకిలీ విత్తన తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.లక్ష వ్యవసాయ రుణాలు తీసుకున్న వారికి సున్నా వడ్డీ అదనంగా తీసుకున్న మరో రూ.లక్షకు పావలా వడ్డీ వర్తింప చేయాలన్నారు. గోదావరి పెన్నా నది అనుసంధానం అంటూ నకరికల్లు వద్ద చేపట్టిన ప్రాజెక్టును పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్ మాట్లాడుతూ భూములుంటేనే రైతు కాదని సాగు చేస్తే నిజమైన రైతని అన్నారు. పంటల ఇన్పుట్ సబ్సిడీ చేసిన రైతులకు కాకుండా భూ యజమానులకు దక్కుతుందన్నారు. వాస్తవ సాగుదారుడికి అయిన ఖర్చుకు పంపిణీ చేసిన ఇన్పుట్ సబ్సిడీకి సంబంధం లేకుండా ఉందని విమర్శించారు. గతంలో రుణాలు తీసుకొని చెల్లించిన కౌలు రైతులకు కూడా బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని దీనికి భూ యజమాని సంతకమే ప్రధాన సమస్యగా మారిందని కౌలు రైతులకు కార్డుల మంజూరులో రుణం మంజూరులో భూ యజమానికి సంబంధం లేకుండా సరళతరం చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకర్ల సమావేశంలో ప్రతి రైతుకు రుణాలు ఇస్తామని ఉత్తుత్తి ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, 28 మండలాలు ఉండగా 9 మండలాల్లోనే ఒక మోస్తరు వర్షపాతం నమోదైందని, ఈ పరిస్థితుల్లో రైతుల ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా వ్యవసాయ శాఖ అధికారులు సూచనలు చేయాలని కోరారు. జిల్లాలో అసంఘటితరంగ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని, ఆయా సమస్యలపై నిరసనలు చేసినా అధికారులు సమస్యలు పరిష్కారం కొరకు చర్చలు జరపలేదన్నారు. ఉపాధి హామీ పనులు పెంచాలని సకాలంలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.










