ప్రజాశక్తి -బుచ్చయ్యపేట
వరి పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాడు. మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం ఉదయం నుండి చిరుజల్లులు కురవడంతో పొల్లాల్లో కోతలు కోసి ఆరబెట్టిన వరి పంట తడిసిపోరుంది. ఒకవైపు వరి పంట కోతలకు సిద్ధంగా ఉండడంతో పంట చేతికి వచ్చే సమయంలోనే వర్షాలు కురుస్తుండడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో వరి పంట కోతలకు సిద్ధంగా ఉంది. నీలకంఠాపురం, రాజం, పెద్దమదిన గున్నెంపూడి ,కొండపాలెం, బుచ్చయ్యపేట తదితర గ్రామాల్లో గత రెండు రోజులుగా కొంతమంది రైతులు వరి పంటను కోసి మడులలోనే విడిచిపెట్టారు. కోసిన వరి పంటను రెండు మూడు రోజులపాటు పొలాల్లో ఎండబెట్టి కుప్పలుగా పెడతారు. అయితే శుక్రవారం ఉదయం కురిసిన వర్షానికి పెద్దమదిన, గుణెంపూడి నీలకంఠాపురం తదితర గ్రామాల్లో కోసి పొలాల్లో విడిచిపెట్టిన వరి పంట తడిచిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వచ్చే సమయాల్లోనే వర్షాలు కురుస్తుండడం వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు.










