Apr 10,2023 01:04
విక్రయానికి తెచ్చిన వరిగడ్డ

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: వ్యవసాయ యాంత్రీకరణ అన్నదాతలకు లాభదాయకంగా ఉన్నా దీని కారణంగా పాడి రైతులపై ప్రభావం పడుతోంది. గతంలో వరి పంటను కూలీలు కోసేవారు. దీంతో గడ్డి పుష్కలంగా లభించేది. ప్రస్తుతం అధిక శాతం మంది కర్షకులు వరికోత యంత్రాలు వాడడంతో పశుపోషకులకు వరిగడ్డి దొరకడం లేదు. దీని వల్ల పాడిరైతులు అధిక ధరలు వెచ్చించి దూరప్రాంతాల నుంచి గ్రాసాన్ని కొనుగోలు చేయాల్సి రావడంతో ఎగుమతి, దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి మరింత భారంగా మారింది.
గతంలో ఇలా..
పశుగ్రాసం కొరత ఏర్పడుతుందన్న ముందుచూపుతో గత ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాల పెంపకానికి చేయూతనిచ్చింది. వ్యవసాయ, పశుసంవర్ధక శాఖలు వార్షిక, ఏకవార్షిక గడ్డి విత్తనాలు, నారు అందించి క్షేత్రాల పెంపకానికి రైతులకు సహకారం అందించింది. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం వాటికి స్వస్థిపలకడంతో పాడిరైతులకు అంతకంతకు పశుపోషణ భారం మారింది. గత ప్రభుత్వం పాడిరైతులకు పశుగ్రాస విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా పశుగ్రాస క్షేత్రాల పెంపకాన్ని ప్రోత్సహించింది. నేటి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు.
వరి గడ్డి ధరకు రెక్కలు..
యర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాల్లోని అనేక గ్రామాల్లో పాడిపై అత్యధిక మంది జీవనం సాగిస్తారు. పశుసంవర్ధకశాఖ గణాంకాల ప్రకారం యర్రగొండపాలెం మండలంలో 4000 ఆవులు, ఎద్దులు, కోడె దూడన్నాయి. 18 వేలు గేదెలున్నాయి. 60 వేల గొర్రెలు, మేకలు ఉన్నాయి. పుల్లలచెరువు మండలంలో 4500 ఆవులు, ఎద్దులు, కోడె దూడలు, 20 వేల గేదెలు, దున్నపోతులు, 65 వేల మేకలు, గొర్రెలున్నాయి. రెండు మండలాల్లో 15 వేల ఎకరాల్లో వరిసాగవుతోంది. అయితే ఆ గడ్డి పశువులకు సరిపోయే పరిస్దితి లేదు. దీనికి తోడు యంత్రాల వినియోగంతో పశువులకు సరిపడా గడ్డి దొరకడం లేదు. ఒక్కో పశువుకు రోజుకు మూడు నుంచి ఐదు కిలోల వరకు గడ్డి అవసరం అవుతోందని పశుపోషకులు చెబుతున్నారు. కూలీలు రవాణా ఖర్చులతో కలిపి ట్రాక్టర్‌ గడ్డికి రూ.13 వేల నుంచి రూ.16 వేలు వరకు ఖర్చు కావడంతో పాడి రైతులకు భారంగా మారింది. ప్రభుత్వం పశుగ్రాస క్షేత్రాలను తిరిగి ప్రోత్సహించాలని పశుపోషకులు కోరుతున్నారు.