Oct 29,2022 23:34

పొలాలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

ప్రజాశక్తి -ఆనందపురం : వరి పంటకు వ్యాపించే తెగుళ్లుపై అప్రమత్తంగా ఉండాలని అనకాపల్లి సీనియర్‌ శాస్త్రవేత్త భవాని సూచించారు. బోని, చందక రైతు భరోసా కేంద్రాలను, పంట పొలాలను శనివారం ఆమె పరిశీలించారు. బోని గ్రామంలో వరి పంటను పరిశీలించి సాంబామసూరి రకంలో సుడిదోమ ఉధృతిని గమనించారు. ఈ దోమ ఒక దుబ్బుకు నాలుగు నుంచి ఐదు దోమలను వ్యాప్తి చేస్తుందని, వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ఒక ఎకరాకు పైమోటరోజన్‌120 గ్రాములు, డైనోటేపూరన్‌ 80 గ్రాములు 200 మీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేస్తే వాటిని నివారించవచ్చన్నారు. ఈ పంట నమోదు చేసిన రైతులు వివరాలు మండలంలో అన్ని రైతు భరోసా కేంద్రాల్లో, గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించినట్లు తెలిపారు. పంట నమోదులో ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 31వ తేదీ లోపల రైతు భరోసా కేంద్రంలో సరిచేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భీమిలి వ్యవసాయ సంచాలకులు బి.విజయప్రసాద్‌, మండల వ్యవసాయ అధికారి సంధ్యారత్న ప్రభ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.