Sep 16,2023 21:48

పొలంలో వరి నాట్లు వేస్తున్న కూలీలు

వరి సాగుపై ముందడుగు
- రుద్రవరం మండలంలో విస్తారంగా సాగు
- తెలుగు గంగ నీటిపై రైతుల ఆశలు
ప్రజాశక్తి - రుద్రవరం

        ఖరీఫ్‌ కరిగిపోయింది.. రబీ ఆసన్నమైంది... ఇంతవరకు వాగులు, వంకలు పొంగి ప్రవహించేలా ఒక్క వర్షం కూడా కురవలేదు. అయినా తెలుగు గంగ నీటిపై ఆశలతో రుద్రవరం మండలంలో వరి సాగుపై రైతులు ముందడుగు వేస్తున్నారు. మండలంలో ఖరీఫ్‌లో అరకొరగా కురిసిన వర్షానికి రైతులు మొక్కజొన్న 6 వేల ఎకరాలు, మినుము 1500 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. అయితే వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్‌ ఆరుతడి పంటలు ఎండుముఖం పట్టాయి. ఎకరానికి దాదాపు రూ.20 వేల దాకా పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తే వర్షాలు కురవక కీలక దశలో ఉన్న పంట దెబ్బతిని నష్టాలు తప్పవన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. రైతుల సమస్యలను తెలుసుకున్న ప్రభుత్వం వెలుగోడు బ్యాలెన్స్‌ రిజర్వాయర్‌ నుంచి తెలుగు గంగ ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. పది రోజుల తర్వాత నీరు అందుబాటులోకి రావడంతో పంట కాలువలు, ఆయిల్‌ ఇంజన్లు, ట్రాక్టర్ల ద్వారా వాడుముఖం పట్టిన పంటలకు రైతులు నీరు పారించుకున్నారు. మొన్నటి వరకు వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల నుంచి నీరు అంతంతమాత్రంగానే పారేది. తెలుగు గంగ నీరు రావడంతో భూగర్భ జలాలు పెరిగి తిరిగి బోరుబావులకు నీరు సమృద్ధిగా అందుతుంది. 15 రోజుల విరామం తర్వాత అధికారులు తెలుగు గంగ కాలువ ద్వారా నీరు విడుదల చేశారు. ఆ నీరు కొద్ది కొద్దిగా చెరువుల్లోకి చేరుతోంది. అంతే ఒక్కసారిగా ఆయుకట్టు రైతులు ఆశలు చిగురించాయి. బీడుగా ఉన్న పొలాలను ట్రాక్టర్ల ద్వారా బురద సేద్యాలు చేస్తూ పొలాలను నాట్లకు సిద్ధం చేస్తున్నారు. ఎకరానికి దాదాపు రూ.20 వేల దాకా పెట్టుబడులు పెట్టి వరి సాగు చేస్తున్నారు. అయితే రైతులు ఎంతో ఆశతో సాగు చేస్తున్న వరి పంటకు సాగునీరు అందుతుందో లేదోనని సందిగ్ధంలో రైతులు ఉన్నారు. అధికారులు మాత్రం రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాలకు నీరు వస్తే కాలువలకు నీరు విడుదల చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని ప్రకటిస్తున్నారు.
కోటి ఆశలతో వరి పంట సాగు చేస్తున్న
ఈ ఏడాది వర్షాలు కురవలేదు. వరి పంటకు మంచి గిట్టుబాటు ధర పలుకుతాది. అందుకే ఎంత కష్టమైనా వరి పంట సాగు చేస్తున్నా. అరకొరగా వస్తున్న నీళ్లతో పంటలు పండుతాయని ఆశగా ఉంది. తెలుగంగ కాలువ ద్వారా వారబందీ పద్ధతిలో నీరు విడుదల చేయాలి.
- రైతు ఆనందరాజ్‌, రెడ్డిపల్లె గ్రామం.
డిసెంబర్‌ చివరి దాకా సాగునీరు వదలాలి
తెలుగు గంగ కాలువ ద్వారా చెరువులకు డిసెంబర్‌ చివరి దాకా నీరు వదలాలి. సాగు చేసుకున్న పంటలకు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టాం. నీరు వదలక పోతే పంటలు నష్టపోతాం. అధికారులు విడతల వారీగా నీరు విడుదల చేసి ఆదుకోవాలి.
- రైతు సుబ్బరాయుడు, ఎర్రగుడిదిన్నె.