May 07,2023 00:45

వరి ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

- తడిసిన ధాన్యాన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టని ప్రభుత్వం
- మొలకెత్తిన వరి పనలు
ప్రజాశక్తి- బుచ్చయ్యపేట

తుఫాన్‌ నేపథ్యంలో కురిసిన వర్షానికి వరి పంట తడిసిపోయి నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఆదుకుంటుందని మాటలు అడియాసలే అవుతున్నాయి. ప్రతి గింజ కొనుగోలు చేస్తామంటున్న పాలకులు మాటలకు, చర్యలకు పొంతన ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఐదు రోజుల క్రితం కురిసిన వర్షాలకు మండలంలోని చిన్నప్పన్నపాలెం, వడ్డాది, పోలేపల్లి, విజయరామరాజుపేట, బన్నవోలు, గౌరీపట్నం తదితర గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల్లో వరి పంట తడిసిపోయింది. కోసిన పంట నీటమునగడంతో రైతులు కూలీలను పెట్టి ఒడ్డుకు తెచ్చి ధాన్యాన్ని నూర్చారు. నూర్చిన ధాన్యాన్ని గత రెండు రోజులుగా పొలాల్లోనూ, కల్లాలలోనూ ఆరబెట్టారు. ఒకవైపు ఎండ మరొకవైపు వర్షం చినుకులతో ప్రతిక్షణం ఆందోళనతో ధాన్యాన్ని ఎండబెట్టారు. కానీ అధికారులు రైతుల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం పలువురు రైతులు పొలాల్లో వరి పంటను కోస్తూ, వరి నూర్పిడి యంత్రాల ద్వారాగా వెంటవెంటనే నూర్చుతున్నారు. ఒకవైపు తడిసిన పనలు మొలకెత్తుతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం 60 ఎకరాలకు పైగా రైతులు కోసిన పంట నూర్చి అమ్మకానికి సిద్ధంగా ఉంది. అధికారులు కనీసం పట్టించుకోవటం లేదని చిన్నప్పన్నపాలెంకు చెందిన రైతులు పోతు అప్పారావు, కొల్లివలస నాగరాజు, కుర్చీల నానాజీ, సకల అర్జున, దొండ వెంకటరమణ తదితరులు తెలిపారు.
వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
ప్రజాశక్తి - కె.కోటపాడు : ఇటీవలే కురిసిన అకాల వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయిని బాబు డిమాండ్‌ చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయం శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ వర్షాల వలన నువ్వులు, వేరుశనగ, వరి, మొక్కజొన్న, కూరగాయలు, మిర్చి తదితర పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. అలాగే వైయస్సార్‌ పశు నష్ట పరిహారం పథకం 19 నెలలుగా రైతులకు చెల్లించలేదని, వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం మండల కార్యదర్శి వనము సూర్యనారాయణ, ప్రజా సంఘాల కన్వీనర్‌ ఎర్ర దేవుడు, కెవిపిఎస్‌ జిల్లా నాయకులు గాడి ప్రసాదు పాల్గొన్నారు.