ప్రజాశక్తి- కె.కోటపాడు
ఈ సంవత్సరం వర్షాలు అధికంగా కురవడంతో వరి పైరు ఆశాజనకంగా ఉంటుందన్న రైతులు భావించగా, తెగుళ్ల రూపంలో వారి ఆశలు అడియాశలయ్యాయి. వరి పంటపై తెగుళ్ల దాడి ఎక్కువ కావడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కె.కోటపాడు మండలంలో ఈ ఏడాది 2,245 హెక్టార్లలో రైతులు వరి సాగు చేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షాలు సంతృప్తిగా కురవడంతో మెట్టు ప్రాంతాల్లో కూడా వరి పంట వేశారు. ఈ ఏడాది వరి ఆశాజనకంగా ఉంటుందని భావించగా, వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కసారిగా తెగుళ్లు బెడద ఎక్కువైంది. ప్రతి ఏటా ఆకు ముడత, పాచి తెగులు, దోమకాటు వరిలో ఎక్కువగా కనిపించేవి. ఈ దఫా దోమకాటు అధికంగా ఉంది. దీని వల్ల ఎక్కువ నష్టం జరగనుందని రైతులు అంటున్నారు.
రైతులకు ఎప్పటికప్పుడు పలు సూచనలు ఇస్తున్నా కొందరు రైతులు సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ నష్టాల పాలవుతున్నారని వ్యవసాయాధికారులు అంటున్నారు. ఉడుపుల సమయం నుండే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే తెగుళ్లను 90 శాతం వరకు నివారించుకోవచ్చని చెబుతున్నారు. ఊడుపుల సమయంలో దూర దూరంగా నాట్లు వేసుకుని, మధ్య మధ్యలో నడకదారులు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పినా కొందరు రైతులు పట్టించుకోవడం లేదని, దీనివల్ల పంట లోపలికి గాలి వెలుతురు లేకపోవడంతో తెగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. అలాగే యూరియా అధికంగా వాడటం కూడా వరి పంటకు ప్రమాదకరంగా ఉంటుందని అంటున్నారు.
రైతులు ఎక్కువగా పంట మార్పిడి చేయకపోవడం కూడా తెగుళ్లకు కారణమవుతుందని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆర్‌జెఎల్ రకం వేస్తున్నారు. గత పదేళ్ల నుండి ఇదే రకం వేయడం కూడా తెగుళ్లు సోకటానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. రోజు విడిచి రోజు పురుగుమందులు పిచికారీ చేస్తున్నా ఈ సంవత్సరం 30శాతం వరకు పంట దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.
సుడి దోమ నివారణకు తక్షణమే చర్యలు
సుడి దోమ నివారణకు రైతులు దుబ్బులను పరిశీలించి దుబ్బుకు ఐదు తల్లి పురుగులు కన్నా ఎక్కువ ఉంటే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ముందుగా పొలంలో ఎక్కువగా ఉన్న నీటిని తీసివేయాలి. సూర్యరశ్మి తగిలే విధంగా జాడులుగా తీయాలి. ఎకరానికి 120 గ్రాముల పైమెట్రోజిన్ అనే మందును నేరుగా గాని, లీటర్ వేప నూనెలో కలిపిగాని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదంటే డైనిట్రొఫురాన్ అనే మందును ఎకరానికి 100 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. దోమ దుబ్బులను అంటిపెట్టుకొని ఉంటుంది. దుబ్బులు బాగా తడిచే విధంగా పురుగు మందు పిచికారీ చేయాలి.
- సోమశేఖర్,
మండల వ్యవసాయ శాఖాధికారి










