Nov 10,2022 23:54

వరి పంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

ప్రజాశక్తి -తగరపువలస : భీమిలి మండలం దాకమర్రి గ్రామంలోని వరి పంట పొలాలను డాట్‌ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ భవాని, డిఆర్‌సి ఎడిఎ చదువుల సుబ్రహ్మణ్యం, భీమిలి మండల వ్యవసాయ శాఖాధికారి బి.శివకోమలి గురువారం సందర్శించారు. సోనా మసూరి, సాంబ మసూరి రకాల్లో కొన్ని చోట్ల దోమ పోటు కనబడిందని వారు తెలిపారు. దీని వల్ల వరి పంట కాండం మొదళ్లు లేత పసుపు రంగు నుంచి ఎరుపు రంగులోకి మారడం, తర్వాత పంట మొత్తం గడ్డి రంగులోకి మారుతుందని వివరించారు. ఈ లక్షణాలు కనబడిన వెంటనే పొలంలో ఉన్న నీటిని పూర్తిగా తీసేసి ఎండ గట్టాలని రైతులకు సూచించారు. పొలాన్ని పాయలుగా విడదీసి, మొక్క మొద ళ్లు తడిచేలా మందు కొట్టాలని వివరించారు. కోతకు ఇంకా 20 రోజులు సమయం ఉంటే వయో మెట్రిజిన్‌ 6 గ్రాములు ద్రావణం లీటరు నీటికి చొప్పున 120 గ్రాములు ఎకరా కు పిచికారీ చేయాలని చెప్పారు. డినో ట్‌ ఫ్యురాన్‌ 4 గ్రాముల ద్రావణం లీటరు నీటికి చొప్పున 80 గ్రాములు ఎకరా కు పిచికారీ చేయాలన్నారు. ట్రిప్టు మైజో పైరిన్‌ 48 గ్రాములు లీటరు నీటికి చొప్పున 96 గ్రాములు ద్రావణం పిచికారీ చేయాలని తెలిపారు. సోనా మసూరి పొలాల్లో పొట్ట దశలో ఆకు ముడత తెగులు ఆశించినట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. దీని నివారణకు కార్తో ఫైడ్రిక్లోరైడ్‌ 4జి గుళికలు ఎకరాకు 8 కిలోలు 20 కిలోల ఇసుకతో కలిపి చల్లటం వల్ల ఆకుముడతతో పాటు కొంత మేర కాండం తొలిచే పురుగును కూడా తగ్గించ వచ్చని తెలిపారు. దాకమర్రి విహెచ్‌ఎ భాగ్యరేఖ, పలువురు రైతులు పాల్గొన్నారు.