ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లా ఏరువాక కేంద్రం, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం వరి పంటల్లో సమస్యలపై మల్టీ లోకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ భవాని మాట్లాడుతూ వరి పంటలో ఎక్కువ సుడిదోమ ఆశిస్తున్నట్టు గుర్తించామని తెలిపారు. దీని నివారణకు భూప్రో ప్రొఫెజోన్ 1.6 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలన్నారు. పాము, పొడ తెగులు ఆశించడం వల్ల వరి దుబ్బు చేసే దశ నుంచి ఆకులపై మచ్చలు ఏర్పడి మొక్కలు ఎండిపోవడం జరుగుతుందని చెప్పారు. దీని నివారణకు హెక్సాకొనజోల్ రెండు మిల్లీలీటర్లు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ జిల్లా మేనేజర్ తిరుమలరావు, ప్రోగ్రాం సపోర్టర్ వి.వెంకట రాము పాల్గొన్నారు.










