ప్రజాశక్తి-భట్టిప్రోలు: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మాగాణి భూముల్లో పోసిన వరి నారుమళ్లు వర్షార్పణం అయ్యాయి. గత ఐదు రోజులుగా ఏకధాటిగా వర్షం పడుతుండటంతో మొలక దశలో ఉన్న నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండ లంలో 15 వేల ఎకరాలకు గాను దాదాపు ఆరు వేల ఎకరాలలో ఈ పరిస్థితి నెలకొం ది. అక్కడక్కడా వెయ్యి ఎకరాల వరకు వెద సాగు చెయ్యగా మరో ఐదు వేల ఎకరాల వరకు ముందుగానే నారుమడులు పోశారు. మండలంలో ఐలవరం, అద్దేపల్లి, సూరేపల్లి, కోనేటిపురం, పల్లెకోన, రాచూరు గ్రామాల లో పోసిన నారు వర్షాలకు దెబ్బతిందని రైతులు పేర్కొంటున్నారు. నీరు అధికమై దెబ్బతింటున్న ఐలవరం, అద్దేపల్లితో పాటు పలు గ్రామాలలో ఎంతోకొంత నారును బతికించుకోవటం కోసం ఆయిల్ ఇంజన్లతో నీటిని బయటకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలావుండగా సుమారు పది వేల ఎకరాల వరకు మెట్ట దుక్కులు లేక పొలాలు బీళ్లుగా మారాయి. దీనికి తోడు కురుస్తున్న వర్షాలకు పొలాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. దెబ్బతిన్న నారుమళ్ల స్థానంలో మరోమారు విత్తనాలు సాగుచెయ్యక తప్పదని, అదనంగా ఎకరా కు మరో మూడు వేల వరకు ఖర్చు చేయా ల్సి ఉంటుందని వాపోతున్నారు. పెరిగిన ఖర్చులతో వ్యవసాయం గిట్టుబాటు కాకపో యినా కౌలుకు అలవాటుపడి అప్పులు తీరకపోయినా సాగు తప్పటం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొంగిపొర్లుతున్న 'నెమలిగుండం'
రాచర్ల: నల్లమల్ల అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. దీంతో వరద నీరు పోటెత్తింది. వరద నీరు చేరడంతో మండల పరిధిలోని జె పుల్లలచెరువు గ్రామ సమీపంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ ప్రాంతంలోని నెమలిగుండం పొంగిపొర్లుతోంది. దీంతో నెమలిగుండం వైపు ప్రజలు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెమలిగుండం నుంచి పొంగిపొర్లుతున్న వరద నీరు గుండ్లకమ్మ వాగు ద్వారా కంభం చెరువుకు చేరుతోంది.










