ప్రజాశక్తి-అనకాపల్లి : అనకాపల్లి జిల్లా ఏరువాక కేంద్రం, రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం మల్టీ లొకేషన్ ఆడియో కాన్ఫరెన్స్ ద్వారా వరి, మినుము రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కోఆర్డినేటర్ డాక్టర్ బి.భవాని, సీనియర్ శాస్త్రవేత్త వి.గౌరీ మాట్లాడుతూ వరిలో రెల్ల రాల్చు పురుగు ఆశిస్తే నివారణకు 1500 పిపిఎం ఐదు మిల్లీ లీటర్లు, వేప నూనె లీటర్ నీటికి చొప్పున కలిపి సాయంత్రం వేళల్లో వరి కంకులపై పిచికారీ చేయాలని సూచించారు. వరి మాగాణీలో వరి కోయడానికి మూడు నుంచి ఐదు రోజుల ముందు మినుము విత్తనాలు వెదజల్లు కోవాలన్నారు. మినుములో పీబీజీ 104, ఎల్బీజీ 787, ఐపిఎం2-14, పియు 31, డబ్ల్యూజిజి 42 రకాలను వేసుకోవాలని సూచించారు. విత్తనాన్ని ఇమిడా క్లోప్రేడ్ ఐదు మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయడం ద్వారా వైరస్ తెగులు, రసం పీల్చే పురుగు, తెల్ల దోమ పురుగు నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు వరి అనంతరం వేసే పెసర, మినుము, నువ్వులు, కూరగాయల పంటలపై సాంకేతిక సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రిలయన్స్ ఫౌండేషన్ మేనేజర్ తిరుమలరావు, ప్రోగ్రాం సపోర్టర్ వివి రాము, సుమారు 70 మంది రైతులు పాల్గొన్నారు.










