Jan 01,2023 23:41

దగ్ధమైన వరి కుప్పలు

ప్రజాశక్తి -రావికమతం :ఆరుగాలం పండించిన వరి పంట అగ్నికి ఆహుతి అయ్యాయి. మండలంలో గుడ్డిప విశాఖ డైరీ పాల కేంద్రం సమీపంలో కల్లాల వద్ద పెట్టుకున్న వరి కుప్పలు ఆదివారం ఉదయం ఖాళీ బూడిదయ్యాయి. గ్రామానికి చెందిన చెన్నం శెట్టి రాము, ఎన్నంశెట్టి వెంకు నాయుడు, గణేషు, కర్రీ వెంకయ్యమ్మ, పిల్ల మహాలక్ష్మిఅమ్మ, గల్లా రాజు, ఎన్నంశెట్టి రాజు, అప్పలనాయుడు, ఇందల పెంటయ్యలకు చెందిన ఎనిమిది వరి కుప్పలు ప్రమాదవశాత్తు ఖాళీ బూడిదయ్యాయి. దీంతో, రైతులు లబోదిబో మంటున్నారు. సంవత్సర కాలం బతుకు పోయిందని కన్నీరు మున్నీరయ్యారు. సుమారు రూ.3 లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగినట్లు పలువురు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాద సంఘటనను తెలుసుకున్న రావికమతం అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.