Nov 04,2022 21:31

ప్రజాశక్తి - భీమడోలు
            మండలంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం విత్తనాల కోసం ప్రత్యేకించిన పొలాల్లో కోతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల పరిధిలో పంట కోత ప్రయోగాలు ప్రారంభించామని భీమడోలు వ్యవసాయాధికారి ఉషారాణి, సహాయ గణాంక అధికారి కె.గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా పంట కోత ప్రయోగం నిర్వహిస్తున్న సూరప్పగూడెం గ్రామాన్ని వారు శుక్రవారం సందర్శించారు. పంట కోత ప్రయోగం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 14 రైతు భరోసా కేంద్రాల పరిధిలోని 32 వ్యవసాయ క్షేత్రాల్లో పంట కోత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ధాన్యం దిగుబడిని పరిశీలించగా ఎకరం ఒక్కింటికి 34 బస్తాల చొప్పున దిగుబడి వచ్చిందన్నారు. అధిక శాతం రైతులు ఎంటియు 1121, స్వర్ణ 7209 రకాలను సాగు చేశారన్నారు. పంటకోత ప్రయోగాల ఆధారంగా మండల పరిధిలో ధాన్యం దిగుబడి అంచనా తయారు చేస్తామని వారి వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ గ్రామ సహాయకులు షైలు భాను, పలువురు రైతులు పాల్గొన్నారు.