ప్రజాశక్తి - చాపాడు
గత ఖరీఫ్, రబీ సీజన్‌లో సాగు చేసిన వరి ధాన్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ధరలు రోజు రోజుకూ పెరుగుతూ పుట్టి (8బస్తాలు) రూ. 23వేలకు చేరుకున్నాయి. డిసెంబర్ నెలలో వరి నూర్పిడి పనులు చేపట్టిన సమయంలో పుట్టి( 8బస్తాల) ధర రూ. 12 వేల వరకు పలికాయి .ఆ తర్వాత జనవరి లో రూ.13 వేలకు ధరలు చేరుకున్నాయి. ప్రస్తుతం రూ.21వేల వరకు చేరుకున్నాయి. గత ఏడాది సాగైన వరి ధాన్యం రూ. 23 వేలకు చేరుకున్నాయి.
వరి సాగు పై తగ్గుతున్న ఆసక్తి...
ఉమ్మడి కడప జిల్లాలో సాధారణంగా కేసి, కుందూ, బ్రహ్మసాగర్, మైలవరం, గండికోట, పలు చెరువుల కింద వరి పంటను అత్యధికంగా సాగు చేస్తున్నారు. దాదాపు మూడు లక్షల ఎకరాల్లో రైతులు రబీ, ఖరీఫ్ సీజన్‌లలో వరిపంటను సాగు చేసేవారు. దాదాపు లక్ష మంది కౌలురైతులు వరిసాగుపై ఆధారపడి ఉన్నారు. వేలాదిమంది వ్యవసాయ కార్మికులు వరిసాగులో పెద్దఎత్తున ఉపాధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా వరుసగా మూడు సంవత్సరాలు వరిసాగులో నష్టాలు తప్పలాభాలు అనేవి లేకుండా పోయాయి. దీంతో క్రమంగా సాగు తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది 50వేల ఎకరాల వరకు సాగు తగ్గింది. దీనికి ప్రధానకారణం సరైన మద్దతు ధరలేకపోవడమే. ఎకరా వరి సాగుకు రూ.35 నుంచి 40వేల వరకు సాగు ఖర్చులు అవుతున్నాయి. పుట్టి వరి ధాన్యం ధర నూర్పిడి సమయంలో రూ. పది వేల లోపు మాత్రమే ఉన్నాయి. 40బస్తాల దిగుబడి వచ్చిన ఖర్చులు కూడా రావడం లేదని రైతులు ఈ ఏడాది వరి సాగు ను తగ్గించారు. ఇతర ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. చా పాడు మండల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో సాధారణంగా 16 వేల ఎకరాల్లో సాగు అయ్యేది. అలాంటిది ఈ ఏడాది 13322 ఎకరాలకు పరిమితమైంది. ధరలు, దిగుబడి పెరగడంతో రబీలో మాత్రం 4వేల ఎకరాలలో వరి సాగును రైతులు చేపట్టారు. ఈ ఏడాది తిరిగి సాగు పెరిగే అవకాశం ఉంది.
దిగుబడి ఆశాజనకం..
గతంలో కంటే ఈ ఖరీఫ్ సీజన్‌లో వరి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి పెరిగినది. ఎకరాకు 32 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.
30 వేల వరకు సాగు ఖర్చులు అయ్యాయని రైతులు పేర్కొన్నారు. దిగుబడి పెరగడం, ధరలు ఆశాజనకంగా ఉండడంతో సాగు ఖర్చులు పోను రైతులకు ఆదాయం చేకురుతోంది . గత ఏడాది మాత్రం అధిక వర్షాలకు, వరద తాకిడికి వరి పంట అధికంగా దెబ్బతింది. వర్షానికి పంట దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.6వేలు నష్టపరిహారం మంజూరైంది. గత ఏడాది ఖరీఫ్ లో సాగు చేసిన లో వరి ధాన్యం ధర రూ. 23 వేలకు పైగా ధర పలుకుతున్నాయి. దీంతో వరి ధాన్యాన్ని నిల్వ ఉంచిన రైతులు అమ్మకాలకు సిద్ధపడుతున్నారు.వరి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర..
వరి ధాన్యానికి గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర అందుబాటులో ఉంది. జనవరిలో రూ. 12వేలు ఉన్న పుట్టి ధర ప్రస్తుతం క్రమేపీ పెరిగి రూ.22 వేలకు పైగా పలుకుతున్నాయి. గతంలో రూ. 17వేలకు మించేవి కావు. ధరలు పెరుగుతుండడంతో నిల్వ ఉంచిన వరి ధాన్యాన్ని అమ్మకాలు చేపడుతున్నాం.
-రామ సుబ్బారెడ్డి, రైతు, బద్రిపల్లె.గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు..
వరి ధాన్యానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ధర వచ్చింది. పాత వరి ధాన్యంతో పాటు వేసవిలో సాగు చేసిన వరి ధాన్యం ధరలు కూడా రూ. 20వేలు పలుకుతున్నాయి. గత ఏడాది పంట అధిక వర్షానికి దెబ్బతిన్నడం, ఈ ఏడాది సాగు తక్కువ కావడం, ఇతర ప్రాంతాలకు ఎగుమతికి అనుమతి వంటి కారణాలతో ధర పెరుగుతున్నది.
-సుబ్బరాయుడు, వరి ధాన్యం వ్యాపారి, చాపాడు.










